తెలంగాణలో కేసీఆర్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మీడియా కూడా కేసీఆర్ వ్యతిరేక వార్తలు రాయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అందులో చాలా వరకూ మీడియాలకు ఆంధ్ర యాజమాన్యాలు ఉన్నందున కేసీఆర్ తో పెట్టుకోవడానికి అంత సుముఖంగా లేవు. కానీ అప్పుడప్పుడైనా కేసీఆర్ పై కాస్త ఘాటుగా రాయలంటే.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే మొనగాడుగా చెప్పుకోవాలి.

 

 

తన తాజా కొత్త పలుకు వ్యాసంలో కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కేసీఆర్ అండ్ కోకు ఓ వార్నింగ్ ఇచ్చారు. కరోనా విషయంలోనూ, తెలంగాణ ఆర్థిక పరిస్థితిపైనా కేసీఆర్ తక్కువ కాలంలో వ్యవహరించిన తీరును రాధాకృష్ణ తప్పుబట్టారు. "ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు ఏమి చెబుతారో, ఏ మాటలు నమ్మాలో అర్థం కావడం లేదు. కరోనా వైరస్‌ ప్రభావం మన మీద పడకముందే ఆదాయం పడిపోతున్నదనీ, దేశంలో ఆర్థిక మందగమనం మొదలైందనీ చెప్పిన పెద్దమనిషి.. ఇప్పుడు మళ్లీ తెలంగాణ బరాబర్‌గా ధనిక రాష్ట్రమేననీ, డబ్బుకు కొదవలేదనీ చెబుతున్నారు. ఈ రెండింటిలో దేన్ని నమ్మాలి?.. అంటూ నిలదీశారు.

 

 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందంటూ మూడు నెలలపాటు కేసీఆర్ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టారు. ఇప్పుడు రైతుబంధు పథకం కింద రైతులకు ఇవ్వడానికే జీతాల్లో కోత అంటున్నారు. ఈ ధోరణిని కూడా ఆర్కే ఎండగట్టారు. "రైతులకు ఇవ్వాలంటే ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా? అలా అయితే ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది? మూడు నెలల్లోనే పది వేల కోట్ల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?.. అంటూ ప్రశ్నల పరంపర కురిపించారు.

 

 

మొదట్లో కరోనా వైరస్‌కు మందు లేదని హడావుడి చేసి.. దేశంలో అందరికంటే ముందే లాక్‌డౌన్‌ ప్రకటించారని.. ఇప్పుడేమో హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్నా నోరు మెదపడం లేదని కేసీఆర్ తీరును తప్పుబట్టారు. అంతే కాదు.. కరోనాను అరికట్టలేకపోతున్నారని ఎవరైనా అంటే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీస్తారా? అంటూ హూంకరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి హెచ్చరికలు ఆరేళ్ల క్రితం చెల్లుబాటు అయ్యాయి గానీ, తెలంగాణ ఏర్పడిన ఇంతకాలం తర్వాత కూడా అవే మాటలు చెబితే సానుకూలంగా స్పందించడానికి ప్రజలు అమాయకులు కాదని కేసీఆర్‌ అండ్‌ కో గుర్తుంచుకోవాలంటూ ఆర్కే చురకలు వేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: