మన దేశంలో కరోనా ఉధృతి ఊహించ స్థాయి కంటే ఎక్కువగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ నమోదవుతున్న వేలాది కేసులు.. ప్రజల్ని భయపెడుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ గణంకాలు చూస్తుంటే దేశంలో సామాజిక వ్యాప్తి లక్షణాలు కనిపిస్తున్నాయి.
దేశంలో కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 45 వేల 720 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 లక్షల 38 వేల 635కు చేరింది. కొవిడ్ మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయ్. దేశవ్యాప్తంగా 24 గంటల్లో అత్యధికంగా 685 మంది వైరస్‌తో చనిపోయారు. అయితే తమిళనాడులో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. అదనంగా మరో 444 మరణాలు చేరాయి. దీంతో ఒక్కరోజే దేశంలో 11వందల 29 మంది వైరస్‌తో చనిపోయారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 29 వేల 861కు చేరింది.
ఇప్పటివరకు 7 లక్షల 82 వేల 607 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4 లక్షల 26 వేల 167 యాక్టివ్ కేసులున్నాయ్. దేశంలో కరోనా రికవరీ రేటు 63.13 శాతంగా ఉంది. మరణాల రేటు 2.41 శాతంగా ఉంది. ప్రపంచంలో కరోనా మరణాల దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానానికి చేరువయ్యింది. ప్రస్తుతం 30వేల కొవిడ్ మరణాలతో ఫ్రాన్స్ ఆరో స్థానంలో ఉంది. ఒక్కరోజు ముందే స్పెయిన్ ను దాటి భారత్ ఏడో స్థానంలోకి వచ్చింది.
మొదటి నుంచి కరోనాకు కేంద్ర బిందువుగా మారిపోయిన మహారాష్ట్రలో పరిస్థితులు రోజురోజుకి ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రతి రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటకలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. రోజువారీ కేసులు 5వేలకు చేరువలో ఉన్నాయి. రోజువారీ కేసుల్లో ఇప్పటికే కొత్త రికార్డులను నమోదు చేస్తున్న కరోనా.. రానున్న రోజుల్లో మరింత విజృంభించడం ఖాయంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి