ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన సినిమాలలో రాకాస ఒకటి.  సంగీత్ శోభన్  హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా నిహారిక నిర్మాతగా మానస శర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన  ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.  వరుస విజయాలను అందుకుంటున్న సంగీత్ శోభన్ ఈ సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేశారా? నిర్మాతగా నిహారికకు భారీ విజయం దక్కిందా? ఇప్పుడు చూద్దాం.

కథ :

వీరబాబు అలియాస్ ఈరబాబు (సంగీత్ శోభన్) తాను ఇష్టపడిన అమ్మాయి కోసం అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అయితే వీరబాబు ప్రేమించిన అమ్మాయి మాత్రం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఊహించని షాకిస్తుంది.  అదే సమయంలో సోము (వెన్నెల కిషోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలతో వీరబాబు తన పాస్ పోర్ట్ ను పోలీసులకు అప్పజెప్పాల్సి వస్తుంది.  

ఆ ఊరిలో నరబలి ఇచ్చే ఆహారం ఉంటుంది.  ఆ సమయంలో గంగయ్య అనే ముసలాడిని నరబలి ఇవ్వాలని భావిస్తారు.  కానీ వీర ఫ్రెండ్ అయిన బాలరాజును (గెటప్ శ్రీను) కోటలోకి పంపాలని భావిస్తారు. అయితే ఆ కోటలోకి వీర వెళ్లాల్సి వస్తుంది.

నటీనటుల పనితీరు :

తాజా చిత్రంలో సంగీత్ శోభన్ తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. వీర అనే పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి, సినిమా ఆరంభం నుండి ముగింపు వరకు వినోదాన్ని పంచారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మరియు డైలాగ్ డెలివరీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని చెప్పవచ్చు.

హీరోయిన్‌గా నయన్ సారిక తన పరిధి మేరకు ఆకట్టుకోగా, ఒక ప్రత్యేక గీతంలో హీరోతో ఆమె పండించిన కెమిస్ట్రీ వెండితెరపై చూడముచ్చటగా ఉంది. ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ ప్యాకేజ్ గెటప్ శీను. హీరోతో సమానమైన నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తూ, సంగీత్ శోభన్‌కు గట్టి పోటీనిస్తూ నవ్వులు పూయించారు. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. అయితే ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చే వెన్నెల కిషోర్ పాత్ర ఆశించిన స్థాయిలో పండలేదు, ఆయన కామెడీ ట్రాక్ కాస్త పేలవంగా అనిపిస్తుంది. రోహిణి, తనికెళ్ల భరణి, ఆశీష్ విద్యార్థి, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి, సంగీత్ శోభన్ వన్-మ్యాన్ షో మరియు గెటప్ శీను సపోర్ట్‌తో ఈ చిత్రం వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది.

సాంకేతిక వర్గం పనితీరు :

రచయిత్రిగా మానస విజయం సాధించినా, దర్శకురాలిగా సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే, నిహారిక నిర్మాణ విలువలు మరియు సాంకేతిక నిపుణుల ప్రతిభ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి.

విశ్లేషణ :


మిగిలిన జానర్లతో పోలిస్తే హారర్ కామెడీ సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువే. అందుకే వీటిని 'మినిమం గ్యారెంటీ' కథలని పిలుస్తుంటారు. భారీ సెటప్‌లు, స్టార్ కాస్టింగ్ లేకపోయినా.. మంచి కాన్సెప్ట్, కామెడీ ఉంటే చాలు లాజిక్‌లతో పనిలేకుండా ప్రేక్షకులు ఈ చిత్రాలను ఆదరిస్తారు. ఒకే లొకేషన్‌లో సినిమాను పూర్తి చేసే వెసులుబాటు ఉండటం కూడా ఈ జానర్ ప్లస్ పాయింట్.

సాధారణంగా హారర్ కామెడీ అంటే ఒక పాడుబడ్డ ఇల్లు, రివేంజ్ కోసం వేచి చూసే ఆత్మ, అక్కడికి హీరో గ్యాంగ్ రావడం.. ఇలా రొటీన్ ఫార్మాట్‌లో సాగుతుంటాయి. కానీ, 'రాకస' విషయంలో దర్శకుడు మానస శర్మ ఈ మూస పద్ధతిని పక్కన పెట్టి వైవిధ్యమైన కథను రాసుకున్నారు. గ్రామాన్ని పట్టి పీడించే ఒక రాక్షసుడు, అతడిని అంతం చేయబోయి విఫలమైన రాజుల చరిత్రతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ప్రారంభంలోనే అన్ని ట్విస్టులు రివీల్ చేయకుండా, హీరో పాత్రను పరిచయం చేస్తూ కథను వినోదం వైపు మళ్లించిన తీరు బాగుంది. ముఖ్యంగా తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి హీరో ఇబ్బందులు పడే సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో మంచి ఫన్‌ని జనరేట్ చేశాయి.

సంగీత్ శోభన్ తనదైన వన్ లైనర్లతో ఈ సినిమాలో అద్భుతంగా అలరించారు. అతడి టైమింగ్‌కు గెటప్ శీను కామెడీ తోడవటం సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. ముఖ్యంగా పంచాయితీ ఎపిసోడ్, పోలీసుల విచారణ వంటి సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. కథ ఆరంభమైన కొద్దిసేపటికే హీరో కోటలోని రాక్షసుడిని ఎదుర్కోబోతున్నాడని అర్థమైనా, ఆ పరిస్థితులను దర్శకుడు చాలా వినోదాత్మకంగా మలిచారు. ఒక వృద్ధుడిని రక్షించే ప్రయత్నంలో హీరో బృందం ఇరుక్కుపోయే సీన్లు హిలేరియస్‌గా సాగుతాయి.

ద్వితీయార్థం అంతా కేవలం నాలుగు పాత్రల మధ్యే కోట లోపల నడుస్తుంది. రాక్షసుడి నుండి వారు ప్రాణాలతో బయటపడతారా అనే ఉత్కంఠను కొనసాగిస్తూనే, సీరియస్ సందర్భాల్లో వెన్నెల కిషోర్ మరియు సంగీత్ శోభన్ ఇచ్చే పంచ్‌లు హారర్ కామెడీని సమంగా బ్యాలెన్స్ చేశాయి. సినిమాను ఒక చిన్న ఎమోషనల్ పాయింట్‌తో ముగించడం మెప్పించినా, ఆ భావోద్వేగంలో మరింత లోతు ఉంటే బాగుండేదనిపిస్తుంది.

అయితే రాక్షసుడికి సంబంధించిన చిక్కుముడులు విప్పే క్రమంలో వేగం తగ్గడం వల్ల ఆ సీన్లు అంతగా ఆకట్టుకోవు. విలన్‌ను భయంకరంగా చూపిస్తూనే, మరోవైపు హీరో టీమ్ కోటలో చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరగడం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. హారర్ చిత్రాల్లో ఉండాల్సిన థ్రిల్స్ తక్కువగా ఉండటం వల్ల, మొదటి భాగంలో ఉన్న కామెడీ టెంపో సెకండాఫ్‌లో కొంత మిస్సయినట్లు అనిపిస్తుంది.

రేటింగ్ : 3.25/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: