ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచినట్టే కనిపిస్తోంది. అమరావతి రైతులకు అన్నివిధాలా అండగా ఉంటానన్న ఆయన మాటలు నీటి మూటలవుతున్నాయి. కేవలం చంద్రబాబును నమ్మే అక్కడి రైతులు భూములు ఇచ్చారన్నది జగమెరిగిన సత్యం.. కానీ.. ఆ తర్వాత చంద్రబాబు అధికారం కోల్పోవడంతో సీన్ మారిపోయింది. జగన్ సీఎం కావడంతో రాజధాని అమరావతికి గ్రహణం పట్టింది.

ఏపీ సీఎం జగన్ ఒక్క రాజధాని కాదు.. మూడు రాజధానులు అంటూ.. ప్రధానమైన కార్యనిర్వాహక వ్యవస్థను విశాఖ తరలించాలని నిర్ణయించేశారు.. ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కోర్టుల‌లో కాస్త ఎదురు దెబ్బలు తగులుతున్నా జగన్ తన నిర్ణయం మార్చుకునే అవకాశమే లేదు. ఇక జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఉద్యమం 300 రోజులు పూర్తి చేసుకుంది.

మొదట్లో అమరావతి రైతుల ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇచ్చారు. కొంతకాలం దీక్ష శిబిరాలకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన సతీమణి అమరావతి ఉద్యమం కోసం బంగారు గాజులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్రమంతటా తిరిగి భిక్షాటన చేస్తానని ప్రకటించారు. రెండు, మూడు  పట్టణాల్లో భిక్షాటన కూడా చేశారు. కానీ.. ఆ తర్వాత కరోనా ఎంటరైంది.

ఇక అప్పటి నుంచి చంద్రబాబు అమరావతి రైతులకు ముఖం చాటేస్తున్నారు. అమరావతి ఆందోళనలకు జూమ్ ద్వారా ట్విట్టర్ ప్రకటన ద్వారా మద్దతు ఇవ్వడం తప్పితే నేరుగా ఆయన ఏ కార్యక్రమానికీ హాజరుకావడం లేదు. ఇక టీడీపీ క్యాడర్ కూడా ఈ ఉద్యమాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. మరి ఇక టీడీపీ కూడా అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోకపోతే.. ఆ ఉద్యమం ఎన్నాళ్లు కొనసాగినా ఊపు వస్తుందా.. ఫలిస్తుందా.. ఈ వ్యవహారం చూస్తే.. చంద్రబాబు అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచినట్టనేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: