మరోసారి ఏపీ మీడియాలో ఈనాడు వర్సెస్ సాక్షి పోరు మొదలైంది. గతంలో ఇలాగే ఈ రెండు పత్రికలు ఒకదాని కథనాలకు మరో పత్రిక కౌంటర్ ఇస్తూ కథనాలు ఇచ్చేవి.. ఇప్పుడు మరోసారి ఆ ట్రెండ్ మొదలైంది. నిన్న ప్రాజెక్టుల నత్త నడక అంటూ ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఓ కథనం ప్రచురించింది.

ఈనాడు ఏం రాసిందంటే.. “ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంతంతమాత్రంగానే ఉంది. అనేక మేజర్‌ ప్రాజెక్టుల్లో ఏడాదిన్నర కాలంగా పనులు సాగట్లేదు. కొన్ని ప్రాజెక్టుల్లో నామమాత్రంగా కాంక్రీటు, మట్టి తవ్వకం పనులు చేస్తున్నారు. పెండింగు బిల్లులు రూ.వందల కోట్లు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ నిలిపివేస్తూ మెమో ఇచ్చారు. ఆ తర్వాత 25 శాతంలోపు పనులు చేసిన ప్రాజెక్టుల పనులన్నీ నిలిపివేయాలని, పునస్సమీక్షించిన తర్వాత అవసరాన్ని బట్టి పనులు చేపడతామని పేర్కొన్నారు.” అంటూ రాసింది.

దీనికి ఈరోజు సాక్షి కౌంటర్ కథనం ప్రచురించింది. టీడీపీ సర్కార్‌ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని దుస్థితి ఉందని కథనం రాసింది. నాటి వైఫల్యాలను ఈనాడు పట్టించుకోలేదని విమర్శించింది.

సాక్షి ఏం రాసిందంటే.. “ ఎల్లోవైరస్‌ కమ్మేసిన కళ్లకు ఇంతకన్నా ఏం కనిపిస్తుంది? ఎందుకంటే వీళ్లకు చంద్రబాబైతే ఓకే!. చంద్రబాబు మాత్రమే ఓకే!!. ఆయన నిద్రపోతున్నా వీళ్ల కళ్లకు రన్నింగ్‌ చేస్తున్నట్లే కనిపిస్తాడు. అదంతే!!. టీడీపీ సర్కారు హయాంలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగాన్ని సగటున రోజుకు ఒకే ఒక్క అడుగు తవ్వారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక సొరంగం పనులను చూస్తే సగటున రోజుకు 7 మీటర్లు తవ్వుతున్నారు. కానీ ‘ఈనాడు’ కళ్లకు ఏనాడూ ఇది కనిపించదు. అధికారంలో ఉన్నది బాబు కాదు కనుక ఇప్పుడు పనులు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయని రాసేస్తారు.” అంటూ ఎదురుదాడి మొదలు పెట్టింది.  మరి ఈ పత్రికల పోరు ఇంతటితో ఆగుతుందో.. మరింత ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: