కేంద్ర ప్రభుత్వం- రైతుల మధ్య చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. చట్టాల్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుంటే.. సవరణలు చేస్తామని కేంద్రం అంటోంది. బుధవారం మరోసారి చర్చలు జరుగుతాయని కేంద్రం ప్రకటించింది. కేంద్రం దిగిరాకపోతే 8న భారత్ బంద్‌ చేస్తామంటున్నాయి రైతు సంఘాలు.

చర్చలు జరుగుతున్నా ఏదీ తేలడం లేదు. రైతుల డిమాండ్లకు  కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. అవసరం అయితే చట్టాలకు సవరణలు చేస్తాం కానీ.. చట్టాల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటోంది కేంద్రం. రెండు వర్గాలు పట్టు వీడకపోవడంతో.. చర్చలు ముందుకు సాగడం లేదు. రైతులు తమ డిమాండ్ల విషయంలో పట్టుదలతో ఉన్నారు. కేంద్రం దిగిరాకపోతే ఏడాది పాటు ఢిల్లీలోనే ఆందోళన చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీ శివార్లలో అన్నదాతలు చేస్తున్న ఆందోళన పదో రోజుకు చేరింది.

యూపీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన తీవ్రంగా మారుతోంది. ఘాజీపుర్‌ సరిహద్దు వద్ద భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ మహా పంచాయత్‌ నిర్వహించారు. చట్టాల్లో సవరణలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ తాము మాత్రం వాటిని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులు 9వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ రహదారిపైన ఉన్న యూపీ గేటు వద్ద భారీగా రైతులు చేరారు.

కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ.. మరో కొత్త చట్టం తీసుకు రావాలని, కొత్త చట్టం ముసాయిదా తయారీకి రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. రైతు కమిషన్‌లో సభ్యులుగా రైతులకే స్థానం కల్పించాలని కోరారు. ఇందులో నిపుణులు, ఉన్నతాధికారులను చేర్చవద్దని కేంద్రానికి ప్రతిపాదించారు. రైతు కమిషన్‌ రూపొందించిన ముసాయిదాను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి చట్టం చేయాలని రైతులు ప్రతిపాదించారు.

కొత్త వ్యవసాయ చట్టాల్లో ఎనిమిది అంశాలకు సంబంధించి సవరణలు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు  రైతులు ససేమిరా అనడంతో పాటు ఒకానొక దశలో చర్చల్ని సైతం బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు.  అయితే, మంత్రులు వారిని సముదాయించి చర్చలు కొనసాగించాలని సూచించారు. రైతులు తమ డిమాండ్ల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర వ్యవసాయశాఖమంత్రి తోమర్ మధ్యలోనే చర్చల నుంచి వెళ్లిపోయారు.

ప్రభుత్వం దిగి రాకపోతే ఇవే చివరి చర్చలని, మొండి వైఖరితో ఉంటే చర్చలు కొనసాగించేది లేదని రైతు నేతలు కేంద్రానికి తేల్చి చెబుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే మరోసారి చర్చల్లో పాల్గొనబోమని, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు ఢిల్లీని దిగ్బంధిస్తామని తెలిపారు.





మరింత సమాచారం తెలుసుకోండి: