శబరిమల భక్తుల కు కరోనా పరీక్ష లు

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈసారి పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో మసలుకోవాల్సి వస్తోంది. కొవిడ్‌ కారణంగా పలు నిబంధనలు అమలులోకి వచ్చాయి. నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకు మండల మహోత్సవం, డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు మకర విళక్కు మహోత్సవం సందర్భంగా అయ్యప్ప దర్శనానికి స్వాములు వెళ్తున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో భక్తుల సంఖ్య కోటి వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో రోజుకు 2,000 మంది, శని, ఆదివారాల్లో 3,000 మందికి మాత్రం అవకాశం కల్పిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం, కేరళ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే స్లాట్‌లు బుక్‌ కాగా, ఖాళీ అవుతున్న వాటిని రాత్రిళ్లు రిలీజ్‌ చేస్తున్నారు. కాబట్టి వెళ్లాలనుకుంటున్న భక్తులు మొబైల్‌లో అయినా పరిశీలించుకుంటూ ఉండాలి. ఇరుముడి వేసుకుంటే, ఏదోవిధంగా అనుమతిస్తారనే భావనతో వెళ్తున్న భక్తులను పోలీసులు వెనక్కి పంపేస్తున్నారు.
శబరిమల చేరే 24 గంటలలోపు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుని, లేదని తేలినవారు మాత్రమే బయలుదేరి రావాలని కేరళ ప్రభుత్వం కోరింది. రోడ్డుమార్గాల్లో వెళ్లేవారిని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో.. ఇంకా రైల్వేస్టేషన్‌లో, విమానాశ్రయాల్లో నిలిపి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. శబరిమల ఆన్‌లైన్‌ డాట్‌ ఆర్గ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వర్చువల్‌ క్యూ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, కొవిడ్‌ పరీక్ష ఫలితం, ఫోన్‌ నంబరు నమోదు చేసుకుని వదులుతున్నారు. కరోనా ధ్రువపత్రం లేకుంటే రూ.625 రుసుముతో నిర్ధారణ పరీక్ష అక్కడే చేయించి.. నెగెటివ్‌గా తేలితేనే అనుమతిస్తున్నారు. వేర్వేరు మార్గాల్లో పంబకు చేరే వీలున్నందున, ప్రైవేటు వాహనాలు పార్కింగు చేసే నీలక్కల్‌కు 20 కిలోమీటర్ల ముందు, నీలక్కల్‌ నుంచి పంబకు వెళ్లే బస్టాండు వద్ద, పంబ నుంచి శబరి నడకయాత్ర (చిన్నపాదం) ప్రారంభమయ్యే గణపతి ఆలయం వద్ద కూడా ఈ పరిశీలనలు సాగుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: