సంగారెడ్డి
జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది పేలుడు కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో పరిశ్రమ నుంచి కార్మికులు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భయంతో చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులూ పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు గాయాలు కావడంతో వారిని
బాచుపల్లి ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో
పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. పరిశ్రమలోని రియాక్టర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. షిఫ్ట్‌ఛార్టుల ఆధారంగా ఎంత మంది పరిశ్రమలో ఉన్నారన్న దానిపై యాజమాన్యం ఆరా తీస్తోంది. దట్టంగా పొగలు అలుముకోవడంతో పరిశ్రమలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
భారీ స్థాయిలో పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను ఆయా పరిశ్రమల యాజమాన్యాలు ఖాళీ చేయిస్తున్నారు. అంతే కాకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల పరిశ్రమల్లోని రియాక్టర్లను సిబ్బంది చల్లబరుస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న 4 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొన్ని అగ్నిమాపక శకటాలను తెప్పించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 120 మంది ఉన్నట్లు సమాచారం.