ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఖాళీల లెక్క తేల్చి నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. నియామకాల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారమని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఏయే శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేలాల్సి ఉంది. వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇక...సీఎం కేసీఆర్ ప్రకటనతో ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే చర్చ మొదలైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరున్నర ఏళ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 31 వేల 52 పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 4 వేల 6 వందలకు పైగా పోస్టులకు అభ్యర్థుల సెలక్షన్ తుది దశలో ఉంది. టీఎస్పీఎస్సీ ద్వారా ఏడాదికి కనీసం 6 వేల ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. వీటితో పాటు పోలీసు ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఫిలప్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో వివిధ శాఖల్లో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. ఈ ఆరేళ్లలో మరో 50 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయి ఉంటారని అంచనా. అన్నీ కలుపుకుంటే రాష్ట్రంలో రెండు లక్షల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. రాజకీయ పార్టీ లు..నిరుద్యోగులైతే రాష్ట్రంలో మూడు లక్షల ఖాళీలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: