ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ.. మరో బాంబు పేల్చారు. ఈసారి ఆయన బీజేపీపై పేల్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు బీజేపీ అగ్రనేతలు జగన్ కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. వారి వల్ల ఏపీలో బీజేపీ నాశనం అవుతోందని విమర్శించారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటారా.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు విష్ణువర్ధన్‌‌‌రెడ్డి, జి.వి.ఎల్‌ నరసింహారావు తదితరులు అట.  వీరికి ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌ అండగా ఉంటున్నారట. ఈ నలుగురూ బీజేపీ ముసుగులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి పనిచేస్తుంటారని  రాధాకృష్ణ చెబుతున్నారు.

అంతే కాదు.. వీళ్లుకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకడానికి అలవాటు పడిపోయారని నేరుగానే విమర్శించారు. పనిలో పనిగా సోము వీర్రాజుపైనా ఆర్కే ఘాటు వ్యాఖ్యలు రాసుకొచ్చారు ఆర్కే. ఏ తప్పూ చేయకపోయినా ద్వేషంతో రగిలిపోతున్న వీర్రాజు క్షమాపణ కోరడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని.. అందుకే ఆయన హెచ్చరికలను మేం పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పేశారు. అంతేకాదు, ఆంధ్రజ్యోతి గ్రూపు సంస్థలకు అన్యాయంగా దురుద్దేశాలను పదే పదే ఆపాదిస్తున్న ఆ నలుగురి విషయంలో మేం కూడా ఎలా ఉండాలో అలాగే ఉంటామని వార్నింగ్ ఇస్తున్నారు.

అసలు వీర్రాజు తనను గానీ, తాను  ఆయనను గానీ ఎప్పుడూ కలుసుకోలేదంటున్నారు ఆర్కే. అయినా, తనపై  ద్వేషం ఉందంటే కారణం కులద్వేషమే కావచ్చని తానే ఓ అంచనాకు వస్తున్నారు ఆర్కే. అందుకు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదంటున్నారు. ఏదేమైనా వీర్రాజు అండ్‌ కో హెచ్చరికలకు, బహిష్కరణలకు మేం భయపడమంటున్నారు ఆర్కే. బీజేపీలోని ఆ నలుగురు ఈ విషయం తెలుసుకుంటే మంచిదంటున్నారు.

మొత్తానికి ఆంధ్రజ్యోతికీ- ఏపీ బీజేపీకీ బాగానే లడాయి జరిగేలా ఉంది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి మీడియాను బహిష్కరిస్తున్నామని ఏపీ బీజేపీ ప్రకటించింది. ఇప్పుడు ఆర్కే బీజేపీనేతలే టార్గెట్‌గా కథనాలు రాస్తున్నారు. చూడాలి.. ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: