తెలంగాణ రాజకీయాల్లో కాలుమోపిన వైఎస్ షర్మిల.. సీనియర్ నేతలెవరి అండదండలు లేకపోయినా సోలోగా దూసుకెళ్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, ఇతర వర్గాల సమస్యలను సునిశితంగా ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రస్తుతానికి బలంగా లేవు. వచ్చే ఎన్నికలనాటికి బలపడతామని గొప్పలు చెప్పుకుంటున్నా కూడా టీఆర్ఎస్ ని ఢీకొనడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అదే సమయంలో షర్మిల ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ కి పోటీగా ఎదగాలని, కనీసం తెలంగాణలో తన ఉనికి చాటుకోవాలని ఉబలాటపడుతున్నారు. అయితే ఈటల ఎపిసోడ్ తర్వాత షర్మిల బాగా అలర్ట్ అయ్యారని తెలుస్తోంది.

గతంలో నిరుద్యోగుల తరపున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన షర్మిల తెలంగాణలో హైలెట్ అయ్యారు. ఇందిరా పార్క్ వద్ద కొలువులకోసం దీక్ష చేపట్టిన ఆమెను పోలీసులు బలవంతంగా తరలించడంతో మీడియాలో ఆమె దీక్ష హైలెట్ అయింది. జులై 8న పార్టీనిప్రకటించబోతున్న షర్మిల ఆలోగా జిల్లాల పర్యటన పూర్తి చేయాలనుకున్నారు. కరోనా ఆంక్షల కారణంగా కొన్నాళ్లు ఆమె బెంగళూరు వెళ్లారు. అయితే అంతలోనే టీఆర్ఎస్ రాజకీయాల్లో కుదుపు వచ్చింది. ఈటలను మంత్రి మండలినుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన పార్టీమారారు. బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయ కలకలం రేగింది. ఈ దశలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుగ్గా నిర్వహించాలనుకున్న షర్మిల.. తెలంగాణ పర్యటనలు ఖరారు చేసుకున్నారు.


 

ఒకరకంగా ఈటల ఎపిసోడ్ తర్వాత షర్మిల బాగా అలర్ట్ అయ్యారు. ఈటల తమ పార్టీలో చేరతానంటే అభ్యంతరం లేదని గతంలో చెప్పిన షర్మిల.. ఆ తర్వాత కేసులకు భయపడే ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని కూడా విమర్శించారు. ఈటల చేరికతో బీజేపీ బలం పుంజుకుంటుందనే అనుమానంతో షర్మిల అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే జనాల్లోకి వెళ్లడం మొదలు పెట్టారు. నల్గొండ, హుజూర్ నగర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ కూడా షర్మిల వ్యవహారాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉంది. షర్మిలను అంత తేలిగ్గా తీసుకోవాలనుకోలేదు టీఆర్ఎస్. అందుకే హుజూర్ నగర్ పర్యటనలో షర్మిలకు షాకిచ్చారు. మేడారం గ్రామంలో నీలకంఠ కుటుంబాన్ని షర్మిల పరామర్శించాల్సి ఉండగా.. స్థానిక టీఆర్ఎస్ నేతలు వారిని అప్పటికప్పుడే ఇంటినుంచి తరలించారు. దీంతో షర్మిల ఆ ఇంటిముందే నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఒకరకంగా షర్మిలను బలమైన ప్రత్యర్థిగానే టీఆర్ఎస్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: