మనిషి తాను ఎంతో సాధించాననుకుంటాడు.. కానీ.. మనిషి ఎంత సాధించినా.. ఎన్ని జిత్తులు నేర్చినా.. అతడు కేవలం ప్రకృతిలో ఓ జంతువు మాత్రమేనని అప్పుడప్పుడూ నిరూపితం అవుతూనే ఉంటుంది. మనిషి తాను రోదసిని సైతం జయించానని భావించినా.. ఇంకా ఈ భూమి మీద అతడు అరికట్టలేనివి ఎన్నో ఉన్నాయని అప్పడప్పుడు ప్రకృతి నిరూపిస్తూనే ఉంటుంది.


అలాంటి వాటిలో భూకంపాలు, సునామీలు ఎలాగో ఈ కార్చిచ్చులూ అలాగే.. ఎక్కడో ఎలాగో ఓ అడవిలో ఏర్పడిన చిన్న మంట.. క్రమంగా దావానలంగా మారుతుంది. దానికి గాలి తోడై.. అది మనుషులు అంత సులభంగా ఆర్పలేని ఆరని జ్వాలగా మారుతుంది. ప్రధానంగా విదేశాల్లో ఇలాంటి కార్చిచ్చులు కొన్ని రోజులపాటు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు టర్నీ దేశంలో అలాంటి పరిస్థితే తలెత్తింది.


దావానలం టర్కీ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆ దేశంలో పలు చోట్ల చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మర్మారిస్, అంటల్యా, బొడ్రం ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ఆస్తులు దహనం అయ్యాయి.  అంటల్యాలోని మధ్యదరా సముద్ర తీర ప్రాంతం మనవ్ గట్‌లో మంటల్లో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.


ఈ దావానలం ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కార్చిచ్చు విధ్వంసం ధాటికి అంటల్యా మనవ్ గట్‌లోని చాలా గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయట. అలాగే  మర్మరిస్‌లోని ఓ పర్యాటక హోటల్‌కు సమీపంలో మంటలు చెలరేగాయి. పర్యాటకులంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సాధ్యమైనంత త్వరగా ఈ కార్చిచ్చును కంట్రోల్‌ చేయాలని అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ కార్చిచ్చు ఆరేలోగా ఎన్ని ప్రాణాలు బలవుతాయో.. ఎన్ని ఆస్తులు ధ్వంసం అవుతాయో..? అంతే కాదు.. ఈ కార్చిచ్చులో పడి ఎన్ని మూగ జీవాలు మాడి మసైపోతాయో..?


మరింత సమాచారం తెలుసుకోండి: