వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి పథకాలపై ఎంతో ప్రేమతో వాటిని మళ్ళీ తెలంగాణ ప్రజల్లో బ్రతికించడానికి కంకణం కట్టుకుంది. ఆ దిశగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ప్రజల్లో మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయి ఉంది.తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రశ్నిస్తూ అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు మద్దతు తెలుపుతూ దీక్షా కార్యక్రమాలను చేపడుతూ ఉంది. నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను సైతం పరామర్శిస్తూ ప్రజల్లో ఒక మంచి మార్కును ఏర్పరుచుకుంటోంది. అయితే ఇప్పుడు షర్మిల హుజురాబాద్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఒక చిన్న లీడ్ వచ్చింది.

ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం షర్మిల హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదనేది వాస్తవం. అయితే చాల కీలకంగా మారుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో తన పాత్ర లేకుంటే ప్రజల్లోకి వెళ్లే మంచి అవకాశాన్ని కోల్పోయినట్లే అని అనుకుంటోంది. ఇందు కోసం కొత్త ప్రణాలికను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన నిరుద్యోగ సభలో షర్మిల చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ఇంతకీ ఏమని అందంటే... హుజురాబాద్ ఎన్నికలో నిరుద్యోగ యువకులంతా నామినేషన్లు వేయండి. మీ వెనుక ఆర్ధికంగా సపోర్ట్ అందించడానికి నేనుంటానంటూ తెలిపింది. దీనితో రకరకాల సందేహాలు అటు ప్రజల్లో ఇటు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్న ప్రకారం ఇలా చేయడం కేసీఆర్ కు ప్రతికూలంగా మారుతుందట. అయితే షర్మిల కేసీఆర్ మేలు కోసం నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టమంటోందా అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఇదంతా జరగాలంటే షర్మిల చెప్పినట్లు నిరుద్యోగులు వింటారా...? ఏ ఉపయోగం లేదని తెల్సినా అన్ని నామినేషన్ లు వేయడానికి ముందుకొస్తారా ? అసలు షర్మిల మైండ్ లో ఉన్న వ్యూహం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టని రహస్యంగా ఉంది. దీని వలన ఏ పార్టీకి ఎసరు పెట్టనుందో అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: