జగన్ సర్కారు మాత్రం అమరావతిని రాజధానిగా ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. తాజాగా ఇప్పుడు జగన్ సర్కారు పాఠ్య పుస్తకాల్లో సైతం మార్పులు చేసింది. గతంలో పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని ఇప్పుడు తొలగించారు. ఈ ఏడాది కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు పంపిణీ చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించారు. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా గతంలో అమరావతి అనే పాఠం ఉండేది.
ఈ అమరావతి పాఠంలో పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ సవివరంగా ఉన్నాయి. ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ అమరావతి పాఠాన్ని తొలగించేసింది. మొత్తం 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. అంతే కాదు.. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు ఇప్పటికే రెండో పాఠమైన అమరావతిని బోధించేశారు.
ఇప్పుడు ఈ అమరావతి పాఠ్యాంశం కూడా వివాదం అయ్యే సూచనలు ఉన్నాయి. రాజధాని అంశాన్ని తొలగించినా అమరావతి ప్రాంత గొప్పదనాన్ని వివరించే పాఠం ఉంచినా కొంత వరకూ బాగానే ఉండేది. కానీ అసలు మొత్తం అమరావతి పాఠాన్నే ఎత్తేయడంపై విమర్శలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడాలి టీడీపీ దీనిపై ఎలా స్పందిస్తుందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి