ఛీ దీనమ్మ జీవితం.. ఈ మాటే కాకపోయినా.. ఇలా నిరాశ నిస్పృహకు గురికాని వారు ఈ కాలంలో చాలా అరుదు. మారుతున్న రోజుల్లో సుఖవంతమైన జీవితం ఓ ఎండమావిగా మారుతోంది. అనేక ఒత్తిళ్లు.. ఇబ్బందులు సర్వసాధారణం అయ్యాయి. అందుకే చాలాసార్లు ఛీ దీనెమ్మ జీవితం అనుకుంటారు చాలా మంది. అయితే కరోనా తర్వాత ఈ ఫీలింగ్ బాగా పెరిగిపోయందట. ఈ విషయాన్ని ఓ అధ్యయనం బయటపెట్టింది.


అసలే ఇక్కట్లతో సాగే  మధ్యతరగతి బతుకులను కరోనా మరింత అసంతృప్తిమయం చేసిందన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి భవిష్యత్తుపై భయాందోళనలు పెంచింది. కరోనా తర్వాత వరుసగా లాక్‌డౌన్లు, ఇళ్లకే పరిమితం కావడం వంటి పరిణామాలతో జీవితం నరకప్రాయంగా మారింది. దీనికితోడు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం తప్పనిసరి అయ్యింది. కరోనా ప్రభావం కాస్త తగ్గినా ఈ నిబంధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.


ఈ పరిణామాలే ప్రజలకు జీవితంపై అసంతృప్తి భావన కలిగిస్తున్నాయట. ఈ విషయాన్ని బ్రిటన్‌కు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ నేషనల్‌ స్టాటస్టిక్స్‌ సంస్థ.. ఓఎన్‌ఎస్‌ తాజాగా చెప్పింది. కరోనా వచ్చిన  తర్వాత ప్రజల్లో జీవితంపై సంతృప్తి స్థాయి 4 శాతం తగ్గిపోయిందట. అదే సమయంలో భవిష్యత్తుపై ఆందోళన 9 శాతం పెరిగిపోయిందట. అంతే కాదు..  బతకడం కోసం తాము చేస్తున్న పనులేమీ అంత గొప్పవి కావన్న భావన జనంలో రోజురోజుకూ పెరుగుతోందట.


ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 3.20 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడించారట పరిశోధకులు. కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌ నిబంధనలతో అప్పటివరకూ సాఫీగా సాగిన జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. 2018-19లో తాము ఎంతో తృప్తిగా, ఆనందంగా ఉండేవారమని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలామంది చెప్పారట. ఇదే సమయంలో కొవిడ్‌ కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని ఈ పరిశోదన చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: