రాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 18న ఒక్క రోజు స‌మావేశం కానుంది. వాస్త‌వానికి ప్ర‌తి ఆరు మాసాల‌కు స‌భ స‌మావేశం అవ్వాలి. క‌నీసం వారం నుంచి 10 రోజుల వ‌రకు నిర్వ‌హించి.. అనేక విష‌యాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం కేవ‌లం ఒక్క‌రోజుకు మాత్ర‌మే ఈ స‌భ‌ను ప‌రిమితం చేయ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మవుతోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిపై చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విలీనం స‌హా.. ఇత‌ర‌త్రా అంశాల‌ను కూడా చ‌ర్చించాలి.

అయిన‌ప్ప‌టికీ.. ఏపీ ప్ర‌భుత్వం ఒక్క రోజుకే స‌భ‌ను ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై భిన్నమైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న టీడీపీ స‌భ‌లో త‌మ‌ను కార్న‌ర్ చేస్తుంద‌నే వాద‌న ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై ప్ర‌భుత్వం క‌ఠినంగా ఉండ‌డం.. ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో స‌భ‌ల‌ను ఎక్కువ రోజులు కొన‌సాగిస్తే.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని.. భావిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే.. వాస్త‌వానికి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తోంద‌నే విష‌యం చెప్పుకొనేందుకు అసెంబ్లీని మించిన వేదిక మ‌రొక‌టి లేద‌ని అంద‌రూ అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నుంచి మాత్రం కేవ‌లం ఒక్క‌రోజుకే ప‌రిమితం కావాల‌ని నిర్ణ‌యించారు. దీనికి కూడా ఒక కార‌ణం ఉంది. ఆరు మాసాల లోపు అసెంబ్లీ నిర్వ‌హించ‌క‌పోతే.. ఆటోమేటిక్‌గా ప్ర‌భుత్వం ర‌ద్ద‌యిపోతోంది. అదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌కు దారితీస్తుంది.

ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 18న ఒక రోజు స‌భ‌ను పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ రోజు కూడా కేవ‌లం మూడు గంట‌లు మాత్ర‌మే స‌భ‌ను నిర్వ‌హించే అవకాశం క‌నిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతోపాటు.. స‌భ‌లో సీఎం, విప‌క్ష నేత‌ల‌కు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశం ఇస్తార‌ని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఏపీ చ‌రిత్ర‌లో ఒక్క‌రోజు స‌భ‌ను పెడుతున్న ప‌రిస్థితి ఇదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: