తిరుమ‌ల‌, తిరుప‌తిలు భారీ వ‌ర్షాలతో అత‌ల‌కుత‌ల‌మ‌య్యాయి. ర‌హ‌దారుల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తూ ఉన్నాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఎగువ ప్రాంతాల నుంచి వ‌ర‌ద వ‌స్తుండడంతో తిరుప‌తిలోని దాదాపు  ప్రాంతాల‌న్ని నీట మునిగాయి. నాలుగువైపులా నుంచి వ‌ర‌ద ఇంకా కొనసాగుతూనే ఉంది. మోకాళ్ల లోతు నీళ్ల‌లో ప్ర‌జ‌లు రాక‌పోక‌లు సాగిస్తున్నారు. వ‌ర‌ద‌ను బ‌య‌టికి తీసుకెళ్లే కాలువ‌ల స్థాయి మాత్రం అస‌లు స‌రిపోవ‌డ లేదు. వ‌ర‌ద తాకిడికి కొన్ని కార్లు, ద్విచ‌క్ర వాహ‌నాలు కొట్టుకుపోయాయి. తిరుప‌తితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, క‌డ‌ప జిల్లాల‌లోనూ వ‌ర్షం బీభ‌త్సాన్ని సృష్టిస్తుంది.

ఎడ‌తెరిపి లేని కుండ‌పోత వాన‌తో తిరుమ‌ల‌, తిరుప‌తి ప్ర‌జ‌లు బిక్కు బిక్కు మంటూ గ‌డుపుతున్నారు. ముఖ్యంగా తిరుప‌తిలోని శివ‌జ్యోతిన‌గ‌ర్‌, మంగ‌ళం, ప‌ద్మావ‌తిపురం, శ్రీ‌నివాస‌పురం, శ్రీ‌పురం, ల‌క్ష్మీపురం కాల‌నీలను వ‌ర‌ద చుట్టేసింది. లోత‌ట్టు ప్రాంతాల‌లో ఉన్న ఇండ్లు అన్ని మునిగిపోయాయి. శ్రీ‌ప‌ద్మావ‌తి ఇంజినీరింగ్ క‌ళాశాల వర‌ద‌తో నిండిపోయింది. రైల్వే అండ‌ర్ బ్రిడ్జీల వ‌ద్ద భారీగా నీరు చేర‌డంతో మూసివేసి ట్రాఫిక్ మ‌ళ్లించారు. అతి క‌ష్టం మీద డీ మార్ట్ వ‌ద్ద ప్ర‌జ‌లు తాడు సాయంతో రోడ్డు దాటాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఓ వైపు  ఇండ్ల‌లోకి నీరు చేర‌డం, మ‌రో వైపు తిన‌డానికి తిండి, తాగ‌డానికి నీరు లేక  లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

సీకాం క‌ళాశాల వ‌ద్ద బ‌య‌లు దేరిన వాహ‌న‌దారులు 3 కిలోమీట‌ర్ల దూరం ఉన్న న‌గ‌ర పాల‌క సంస్థ‌ను చేర‌డానికి దాదాపు 5 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది. ల‌క్ష్మీపురంలో గురువారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు రావాల్సిన ఓ ప్రయివేటు పాఠ‌శాల బ‌స్సు రాత్రి 8.30 వ‌చ్చే స‌రికి విద్యార్థుల త‌ల్లిదండ్రులు భ‌యంతో బిక్కు బిక్కుమంటూ నిరీక్షించారు. తిరుప‌తిలోని ఎస్‌వీయూలో భారీ వృక్షాలు కూలిపోవ‌డంతో హెచ్‌.టీ విద్యుత్ లైన్లు తెగిపోయాయి. తిరుప‌తి-రామచంద్రాపురం మ‌ధ్య వాగులు భారీగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో రాక‌పోక‌ల‌న్నీ నిలిచిపోయాయి. ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అర్బ‌న్ ఎస్పీ వెంక‌ట అప్ప‌ల‌నాయుడు హెచ్చ‌రించారు.

మ‌రోవైపు క‌ళ్యాణి, ఎన్టీఆర్ డ్యామ్‌ల‌లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుండ‌డంతో గేట్లు ఎత్తారు. దాదాపు 30 ఏండ్ల త‌రువాత క‌ళ్యాణి డ్యామ్ మూడ‌వ గేటును కూడా తెరిచి సుమారు 10వేల క్యూసెక్కుల నీటిని వ‌దిలారు. మ‌రోవైపు చిత్తూరు జిల్లాలోని నారావారిప‌ల్లిలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నివాస ప్రాంగ‌ణంలో వ‌ర‌ద నీరు భారీగానే చేరింది. చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప‌, ప్ర‌కాశం జిల్లాల‌లో వ‌ర్షం బీభ‌త్సానికి పంట న‌ష్టం బారీగానే జ‌రిగిన‌ట్టు అధికారులు అంచెనా వేస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: