వారాంత విషాదాల చెంత లతాజీ కూడా ఉన్నారు.లతాజీ అనే పేరు విని పులకరించిన సందర్భం కూడా ఉంది.దేశం యావత్తూ గాన కోకిలను వినకుండా ఉండడమిక సాధ్యమేనా అన్న ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతోంది.అందుకు లతాజీ మరణం ఓ కారణం. మరణ కాల దుఃఖం మరో కారణం.కరోనా కారణంగా ఆస్పత్రి పాలయిన ఆమె తిరిగి వస్తారని, ఆయుష్షు నింపుకుని మనల్ని అలరిస్తారని భావించడంలో భారతీయులంతా ఉన్నారు.ముందు వరుసలో ఉన్నారు.ఆమె గానం విని పరవశించిన వేల వేల హృదయాలు ప్రార్థించాయి. మతాలకు అతీతంగా ప్రార్థనలు వినిపించాయి. దేవుడి నుంచి వచ్చిన పిలుపు ఇది కాదు అని తెలుసుకోవడం లేదా తెలుసుకుని ఎవరికి వారు సాంత్వన పడడం తప్ప ఇప్పుడిక సాధించేదేమీ లేదు.
మరణ కాలం సంబంధిత వాంఛలు అన్నవి విషాదాలనే మిగిల్చి వెళ్తాయి. స్వరం మనల్ని వీడివెళ్లదు కానీ జీవిత కాలాన ఆమె ప్రయాణం మాత్రం ఒక స్మరణలో దాగి ఉంటుంది.ఒక జ్ఞాపకంలో నిక్షిప్తం అయి ఉంటుంది.ఆ విధంగా లతాజీ మన ముందు తరాలకు జ్ఞాపకం అయి ఉంటారు.ఉండాలి కూడా! కాలం చేసిన కొన్ని గాయాలను వదలి పోవడంలో అర్థంలేదు.గాయాలు వదిలిపోవు..మనమే వాటికి దూరంగా ఉంటూ కొన్ని సందర్భాల్లో పట్టించుకోకుండా వెళ్తూ ఆ స్వర సాన్నిహిత్యం పెంచుకుంటే చాలు కొన్నయినా మేలు జరిగే పనులు మనసుకు దొరుకుతాయి.
లతాజీ గానం కారణంగా భారతీయత విస్తృతం అయింది. భారతీయుల గానం ఓ ప్రపంచ స్థాయి ఖ్యాతికి ఆనవాలు అయింది. మనకు తెలిసిన జానకి, మనకు తెలిసిన సుశీలకు ఆమె ఓ స్ఫూర్తి అయ్యారు. స్వరాల సందళ్లలో కోయిలమ్మ ఉగాది రాక ముందే లోకాన్ని వీడిపోవడం మరిచిపోలేని విషాదం. కాలం ఇచ్చిన కొన్ని కానుకలు మళ్లీ కాలమే తీసుకుని పోయి మౌన కాల
సందిగ్ధతలను మిగిల్చి వెళ్తుంది. కాలం ఇచ్చిన కానుక దేశం మెచ్చిన భారత రత్న..తరాలకు పెన్నిధి అని రాయాలి.
విలువయినవి వెళ్తిపోతే ఉన్న జీవితాన విలువయినవేవో భద్రం చేసుకోవాలి. ఉన్న జీవితాన ప్రేమ మరియు అభిమానం అన్నవి
నిక్షిప్తం చేసుకోవాలి. మనుషులంతా ఇప్పటి దుఃఖాన్ని మాత్రమే గుర్తిస్తారు కానీ మరో భారత రత్నకు ఎవరు అర్హులు అని వెతుకుతారు కానీ వీళ్లెందుకు మరో భారత రత్నను తయారు చేయరు? మనం ప్రయత్నిస్తే కొన్ని కోయిలలకు పునః సృష్టి సాధ్యమే..మనం ప్రయత్నిస్తే కొన్ని గాన లహరులకు పునః సృష్టి సాధ్యమే. భారత దేశ ఖ్యాతి ఖండాంతర ఖ్యాతి అన్నీ నిలిపే శక్తులు మనలోనే ఉన్నాయి. లతాజీ దీవెనలతో అవి మరింత స్థాయిని అందుకోనున్నాయి.లతాజీ మీకు ఇవే నివాళులు..అని రాయడంలో తప్పిదాలు ఉన్నాయి..మీరున్న వరకూ పాట ఉన్న వరకూ స్వర ఉన్న వరకూ ఆగని ఝరిని ఆపడం భావ్యమా! అందుకే మీరు భవ్య గీతిక అని అంటూ..ముగిస్తాను.
- రత్నకిశోర్ శంభుమహంతి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి