ఈనెల 27న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని పరిస్థితిలో ఆయన నేరుగా ఆ కార్యక్రమం నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద సపర్యలు చేసిన కుటుంబ సభ్యులు ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉండటంతో వెంటనే స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. ఆయన్ను పలువురు నాయకులు పరామర్శించారు. ఆ తర్వాత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకున్నారు.
ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత ఎవరైనా ఇంటికి తిరిగి వస్తే కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు, లేదా గుళ్లు గోపురాలకు వెళ్తారు. కానీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాత్రం తనను కాపాడిన వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లారు. కొన్నిరోజులు ఇంటిలో రెస్ట్ తీసుకున్న అనంతరం ఆయన వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి వారికి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు అపోలో ఆస్పత్రి వైద్యులు, ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లిన అంబులెన్స్ డ్రైవర్, అంబులెన్స్ టెక్నీషియన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించారు. వారికి బహుమతులు అందజేశారు. సతీ సమేతంగా వారి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అపోలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తనకు మరో జన్మ ఇచ్చారని చెబుతున్నారు శ్రీధర్ రెడ్డి. అందుకే వారి ఇంటికి వెళ్లాలనిపించిందని, వారిని జీవితంలో మరచిపోలేనని చెప్పారు ఎమ్మెల్యే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి