ప్రతి విషయానికి ప్రతిపక్షాల నోళ్ళు మూయిస్తానంటే కుదరదు. ప్రతి ఆరోపణకు, ప్రతి విమర్శకు ప్రభుత్వం నుండి లేదా పార్టీ నుండి ఎదురుదాడే సమాధానం అంటే ఒప్పుకోరు. రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు పార్టీ నుండి లేకపోతే ప్రభుత్వం నుండి ఎదురుదాడితోనే సమాధానం చెబుతామంటే జనాలు పట్టించుకోరు. కానీ ప్రతిరోజు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ప్రతిపక్షాల నోళ్ళు మూయిస్తామంటే సాధ్యంకాదు.






పై ఫొటో చూస్తేనే తెలిసిపోతుంది ఇపుడిదంతా ఏ విషయంలోనో. జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి పంచాయితీరాజ్, ఆర్ అండ్ బీ, గ్రామీణాభివృద్ధి సంస్ధ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ జూలై 15వ తేదీకల్లా అద్దాల్లా తళతళలాడాలని గట్టిగా చెప్పారు. రోడ్లు అద్దాల్లాగా మార్చాలన్న జగన్ ఆలోచన బాగానే ఉంది. మరి తన ఆదేశాలు అమలయ్యాయా ?  ఎక్కడా జగన్ ఆదేశాలు అమలుకాలేదు. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్ల రిపేర్లు అయ్యాయంతే.






ఇప్పటి రోడ్ల దుస్ధితికి కూడా తెలుగుదేశంపార్టీ ప్రభుత్వమే కారణమి జగన్ నిందిస్తే ఎవరు అంగీకరించరు. టీడీపీ హయాంలోనే రోడ్లు పాడైపోయాయని చెబుతున్న జగన్ మరి తాను సీఎం అయిన మూడేళ్ళల్లో ఏమిచేశారు ?  టీడీపీ హయాంలో రోడ్లపై  రు. 1300 కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం మూడేళ్ళలోనే రు. 2400 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. నిజంగానే అంత ఖర్చుచేస్తే మరా డబ్బంతా ఏమైనట్లు ? మరంత ఖర్చుచేసి నిర్మించిన రోడ్లు ఎందుకిలా తయారయ్యాయి ?






ఇంట్లోనుండి బయటకు వస్తే చాలు  ప్రయాణం  నరకప్రాయంగా మారిందని జనాలు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. రెండేళ్ళ కరోనాసమస్య కాలాన్ని వదిలేసినా తర్వాతైనా రోడ్లు రిపేర్లు చేయించచ్చు కదా. రోడ్లలో గుంతల కారణంగా వాహనాల్లో ప్రయాణిస్తున్న జనాల నడుములు పడిపోతున్నాయి. బాగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల పరిస్ధితులపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఆందోళనలు చేస్తున్నాయంటే కచ్చితంగా చేస్తాయి. ఎందుకంటే వాటికి అవకాశమిచ్చింది జగనే. కాబట్టి రోడ్ల ప్రస్తుత పరిస్ధితికి జగన్ కచ్చితంగా సమాధానం చెప్పితీరాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: