అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఆధారంగా జరుగుతున్న పాలనను జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ చేస్తున్నట్లే ఉన్నారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేయాలని అనుకుంటున్న 8 కొత్త నగరాల ఏర్పాటుకు సొంతజిల్లాలో కొప్పర్తిని ప్రతిపాదించటం ద్వారా జగన్ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయ్యింది. రాష్ట్రం మొత్తంమీద ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలే బాగా వెనుకబడిన ప్రాంతాలని చెప్పాలి. అయితే ఉత్తరాంద్రలో కీలకమైన విశాఖపట్నం ఒక్కటే రాష్ట్రంలో మెగా సిటీ.

మూడు రాజధానుల కాన్సెప్టులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా విశాఖను జగన్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. భూమిపూజలు చేసుకుని మొదలైన నిర్మాణ కార్యక్రమాలు పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పరుగులు తీయటం ఖాయం. ఇక రాయలసీమలోని కర్నూలులో హైకోర్టును ప్రతిపాదించారు. మూడురాజధానులకు అడ్డంకులు తొలగిపోతే హైకోర్టు ఏర్పాటు స్పీడందుకుంటుంది. ఇప్పటికే జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ, విద్యుత్ ఉత్పత్తి యూనిట్ తదితరాల పనులు జోరుగా జరుగుతున్నాయి.

అనంతపురంలో హార్టీకల్చర్, కియా పరిశ్రమతో పాటు చిన్నాచితకా పరిశ్రమలున్నాయి. అయితే జరగాల్సిన అభివృద్ధి ఇంకావుంది. ఇక చిత్తూరులో శ్రీసిటీ సెజ్, తిరుపతి  విద్యా కేంద్రంగా డెవలపైంది. చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లి, చంద్రగిరి ప్రాంతాల్లో కొన్ని పారిశ్రామిక యూనిట్లున్నాయి. చెప్పుకోటానికి పెద్దగా పరిశ్రమలు లేని జిల్లా కడప మాత్రమే. జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీపనులు జరుగుతున్నాయి. ఇదిపూర్తయితే బాగానే ఉంటుంది.

అందుకనే దీనికి అదనంగా జగన్ కడపకు దగ్గర్లోనే ఉన్న కొప్పర్తిని ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఇప్పటికే 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రెడీ చేస్తున్నారు. 3200 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండింటికి అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రు. 1500 కోట్లు ఖర్చుపెడుతోంది. అలాగే ఇండస్ట్రియల్ పార్కులకు కూడా శ్రీకారం చుడుతున్నది. ఈ నేపధ్యంలోనే కొత్త నగరం ఏర్పాటుకు జగన్ కొప్పర్తినే ఎంచుకున్నారు. దీనికి దశలవారీగా కేంద్రప్రభుత్వం వెయ్యికోట్లరూపాయలు కేటాయించబోతోంది. మొత్తంమీద అటు ఉత్తరాంధ్రను, ఇటు రాయలసీమను జగన్ బ్యాలెన్స్ చేస్తున్నట్లే ఉంది చూస్తుంటే. 

మరింత సమాచారం తెలుసుకోండి: