రాబోయే  పార్లమెంటు ఎన్నికల్లో పది సీట్లకు తక్కువ కాకుండా గెలుచుకోవాలన్నది  బీజేపీ టార్గెట్. అందుకు తగ్గట్లుగానే కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. తన పర్యటనలకు తోడు తెలంగాణాలోని 17 పార్లమెంటు సీట్లను ఐదు క్లస్టర్లుగా విడగొట్టి రథయాత్రలు చేస్తున్నారు. ప్రతి క్లసర్లోను  ఏడు నియోజకవర్గాలకు తక్కువ కాకుండా ప్లాన్ చేశారు. ఇదే సమయంలో ఒకవైపు అధికార కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ పై కమలనాదులు పదేపదే రెచ్చిపోతున్నారు.

ఈ నేపధ్యంలోనే పార్లమెంటు ఎన్నికల్లో బలమైన అభ్యర్ధులను పోటీలోకి దింపాలని అగ్రనేతలు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీల్లో ముగ్గురికి మళ్ళీ టికెట్లు ఖాయమని అంటున్నారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి, బండి సంజయ్ కరీంనగర్ నుండి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుండి పోటీ ఖాయమంటున్నారు. సోయం బాబూరావు కే ఆదిలాబాద్ లో టికెట్ ఇచ్చేది లేనిది క్లారిటిలేదు. అంటే బాబూరావుకు కూడా టికెట్ ఇస్తున్నారని అనుకుంటే మొత్తం 17 సీట్లలో నాలుగు టికెట్ ఖాయం చేసినట్లే అనుకోవాలి.

అందుకనే మిగిలిన 13 నియోజకవర్గాల్లోనే గట్టి అభ్యర్ధులను దింపబోతున్నారు. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ ను మల్కాజ్ గిరి లోక్ సభ సీటులో పోటీచేయించటం ఖాయమైందని అంటున్నారు. ఈటలకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. బీసీ నేతగా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నేతగా చాలా పాపులర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేలులో పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. అయితే రెండు నియోజకవర్గాల్లోను పెద్దఎత్తున ఓట్లయితే తెచ్చుకున్నారు. గజ్వేలుపైన దృష్టిపెట్టకుండా ఒక్క హుజూరాబాద్ లోనే పోటీచేసుంటే కచ్చితంగా గెలిచుండేవారని అంటున్నారు.

రాబోయే ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో గెలుపు కోసం నేతలు, క్యాడర్ తో ఈటల మీటింగ్ పెట్టుకుంటున్నారు. అలాగే పార్టీవర్గాల సమాచారం ప్రకారం మహబూబ్ నగర్లో డీకే అరుణ, చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి, మెదక్ రఘునందనరావు, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్ కు టికెట్లు ఖాయమైనట్లు చెబుతున్నారు. చూడటానికి వీళ్ళంతా గట్టి అభ్యర్ధులుగానే అనిపిస్తున్నా ప్రత్యర్ధలుగా ఎవరుంటారనేది చూడాలి. అప్పుడు గెలుపు ఓటములపై అంచనాలు మొదలవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: