- బెజ‌వాడ‌లో క‌త్తులు దూసుకుంటోన్న కేశినేని నాని, చిన్ని
- బెజ‌వాడ పార్ల‌మెంటు చ‌రిత్రలో ఫ‌స్ట్ టైం పోటీ ప‌డుతోన్న అన్న‌ద‌మ్ములు
- క‌న‌క‌దుర్గ‌మ్మ సాక్షిగా ఉత్కంఠ రేపుతోన్న బెజ‌వాడ రాజ‌కీయం


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఇద్ద‌రూ ఒకే తల్లి క‌డుపున ర‌క్తం పంచుకుని పుట్టిన అన్న‌ద‌మ్ములు గ‌తేడాది వ‌ర‌కు క‌ల‌సి మెలిసే ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్నారు. త‌ర్వాత తేడా కొట్టింది. మ‌న‌సులు వేర‌య్యాయి.. ఇప్పుడు రాజ‌కీయ దారులు కూడా వేరు అయిపోయాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు ఇద్ద‌రూ వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తూ ఒకరి మీద మ‌రొక‌రు క‌త్తులు దూసుకుంటూ ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌ల‌తో విజ‌య‌వాడ రాజ‌కీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ పాటికే వారు ఎవ‌రో మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది. వారు ఎవ‌రో కాదు విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానానికి వైసీపీ ,టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. కేశినేని చిన్ని.


కేశినేని నాని స్వ‌త‌హాగా ముక్కు సూటి మ‌నిషే అయినా మ‌న‌స్త‌త్వం ప‌రంగా మంచివాడే. ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌న్న ధృక్ప‌థం మెండుగా ఉన్న వ్య‌క్తి. చ‌దివింది త‌క్కువే అయినా స‌మాజాన్ని బాగా చ‌దివిన వ్య‌క్తి. ముందుగా 2009 ఎన్నిక‌ల టైంలో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి రాజ‌కీయాలు ఆరంభించినా త‌ర్వాత 2014 ఎన్నిక‌ల టైంలో ట్రావెల్స్ అధినేత‌గా ఉంటూనే విజ‌య‌వాడ పార్ల‌మెంటుకు పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఐదేళ్ల పాటు ఎంపీగా ఉండి బెజ‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలో చాలా మంచి ప‌నులు చేయ‌డంతోనే 2019 లో యాంటీ వేవ్‌లో కూడా బెజ‌వాడ ఎంపీగా రెండోసారి విజ‌యం సాధించారు.


త‌ర్వాత టీడీపీ అధిష్టానంతో వ‌చ్చిన గ్యాప్ వ‌ల్లే ఆయ‌న‌కు పార్టీకి.. ఇటు యువ‌నేత లోకేష్ కు మ‌ధ్య దూరం పెరిగింది. స్థానికంగా ఉన్న టీడీపీ నేత‌లు ఆయ‌న్ను వ్య‌తిరేకించారు. కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో నాని కుమార్తె శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా నిల‌బెట్టినా కొంద‌రు లోక‌ల్ టీం స‌పోర్ట్ చేయ‌లేదు. దీంతో శ్వేత కార్పోరేట‌ర్ గా గెలిచినా గెల‌వాల్సిన చోట టీడీపీ ఓడిపోయింది.


ఆ త‌ర్వాతే అధిష్టానం డైరెక్ష‌న్‌తో కేశినేని నాని త‌మ్ముడు కేశినేని శివ‌నాథ్ ( చిన్ని ) తెర‌మీద‌కు వ‌చ్చారు. చివ‌ర‌కు చిన్నికి టీడీపీ ఎంపీ సీటు ఇస్తే.. నాని వైసీపీలోకి వెళ్లి ఎంపీ సీటు ద‌క్కించుకుని పోటీ చేస్తున్నారు. ఇలా బెజ‌వాడ పార్ల‌మెంటు వేదిక‌గా ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జరుగుతోన్న పోరు మామూలుగా లేదు. మ‌రి ఈ పోరులో పై చేయి అన్న‌ది అవుతుందా ? త‌మ్ముడిది అవుతుందా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: