ఇక ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, దేశంలోని కుటుంబాల నికర పొదుపు 47 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు సమాచారం. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో సేవింగ్స్ విలువ 5.3 శాతానికి పడిపోయింది. కాగా 2022లో ఇది 7.3 శాతంగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే భారత్‌లో పొదుపు ఇంతగా తగ్గిపోవడం విచిత్రంగా అనిపిస్తోందని ఒక ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు. 1970ల తర్వాత రుణాలు పెరగడం ఇది రెండోసారి అని అంటున్నారు. రకరకాల అవసరాలకు రుణాలపై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో, అనివార్యంగా వారి పొదుపు తగ్గిపోతోంది. రుణాలు ఎంత ఎక్కువ తీసుకుంటే, ఆ లోన్లను తీర్చేందుకు తమ ఆదాయంలో అంత ఎక్కువ మొత్తం కేటాయించాల్సి ఉంటుంది. ఫలితంగా పొదుపు చేసేందుకు పెద్దగా డబ్బులు మిగలట్లేదు.
మరోవైపు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని చెప్పుకుంటున్న భారత్ నేడు అప్పుల్లో కూరుకుపోవడం ఏమిటని కొంతమంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ ధోరణి భవిష్యత్తు బాగుంటుందనే ఆశాభావాన్ని సూచిస్తోందా? లేక ఆదాయంలో పతనం, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్ల లాంటి సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరిస్తోందా? ఏం అనుకోవాలి? అని ప్రశ్నిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో అధిక మొత్తంలో రుణం తీసుకుంటున్నవారి (క్రెడిట్ డీపెనింగ్)తో పోలిస్తే, తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునేవారి (క్రెడిట్ వైడెనింగ్) సంఖ్య గణనీయంగా పెరిగిందని నిఖిల్ గుప్తా, ఆయన సహచర ఆర్థిక నిపుణులు తనీషా లద్ధాల పరిశీలనలో తేలింది. భారతీయులు తమకు వచ్చే ఆదాయంలో 12 శాతాన్ని లోన్లు తీర్చేందుకు కేటాయిస్తున్నారని వీరి పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రజల పొదుపు తగ్గి, రుణాలు పెరగడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణి కారణంగా మున్ముందు రుణాలు మరింత భారంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ ట్రెండ్ ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే మాత్రం ఆందోళన చెందాల్సిందేనని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆర్ధిక నిపుణులు 1నిఖిల్ గుప్తా, లద్ధా చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి