పార్టీల బలం ఎంత ఉన్నా, స్థానికంగా నాయకుల పనితీరు ఎంతో కీలకమవుతుంది. ఒక నియోజకవర్గాన్ని పార్టీ గెలిపిస్తుందా లేక నాయకుడి క్యారెక్టర్, అభివృద్ధి పనులే ఓటింగ్‌పై ప్రభావం చూపిస్తాయా అనే చర్చలు అన్ని జిల్లాల్లోనూ చోటుచేసుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలో పోలవరం నియోజకవర్గం లో చిర్రి బాలరాజు రాజకీయ ప్రస్థానం ఎలా ఉందా అంటే.. 2024 ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన చిర్రి బాలరాజు, ఒక బలమైన ఎస్టీ నేతగా తనను తాను రుజువు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నా, పోలవరం ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. ఎందుకంటే ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ప్రజలకు ఎదురయ్యే సమస్యలు ప్రత్యేకంగా ఉంటాయి – నిర్వాసితుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, అభివృద్ధి ప్రాజెక్టుల భవిష్యత్తు లాంటి అంశాలు ఇక్కడే ఎక్కువగా కనిపిస్తాయి.


గతంలో 2014-19 మ‌ధ్య‌ టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై వసూళ్ల ఆరోపణలు వచ్చాయి. ఆయన కాలంలో నెగటివ్ ప్రచారం బలంగా సాగింది. కానీ చిర్రి బాలరాజు పరిపాలనలో అవినీతి ఆరోపణలే తలెత్తలేదు. ఇది ఆయనకు కలిసొచ్చిన ముఖ్యమైన విషయం. అవినీతి ఆరోపణల బరువు లేకుండా సాగుతున్న చిర్రి పాలనకు, ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా, స్థానిక సమస్యలపై చిర్రి బాలరాజు స్పందన కూడా పాజిటివ్‌గా ఉందనే ప్రచారం ఉంది. ముఖ్యంగా రోడ్ల అభివృద్ధిపై ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇచ్చాయి. గతంలో సదుపాయాల లేకుండా బెంబేలెత్తిన గ్రామాలు, ఇప్పుడు కనీస రహదారి కనెక్షన్లు పొందుతున్నాయి. తాగునీటి సమస్యల పరిష్కారానికి కూడా చిర్రి బాలరాజు చురుగ్గా వ్యవహరిస్తున్నారు . వర్షాకాలంలో పోలవరం ప్రాంతాల్లో వచ్చే వరదల కారణంగా తుడిపాడు గల ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు అప్రమత్తత చర్యలు తీసుకోవడం, సహాయ శిబిరాల ఏర్పాటుపై దృష్టి పెట్టడం ఆయన పాలనా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది.


అయితే, నియోజకవర్గంలో నిర్వాసితుల సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో భూములు కోల్పోయిన వారికి ఇంకా పూర్తి పరిహారం అందకపోవడం వల్ల చిర్రి బాలరాజుపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ, ఈ సమస్య ప్రభుత్వ స్థాయిలో పరిష్కారానికి చెందాల్సినదిగా ఆయన నిర్దేశిస్తున్నారని తెలుస్తోంది. ఇక పార్టీ పట్ల ఆయన నిబద్ధత, అధిష్టానానికి అనుసరంగా పని చేయడం ఆయనకు బలాన్ని ఇచ్చిన అంశాలు. ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు లేకుండా, నేరుగా ప్రజలతో ఉంటూ పని చేయడం వల్ల చిర్రికి మంచి గుర్తింపు లభించింది. మొత్తంగా చెప్పాలంటే, నియోజకవర్గంలో ఆయన పని తీరుపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా, ఆరోపణల స్వరం లేకుండా, నిష్కళంకంగా సాగుతున్న పాలన మాత్రం చిర్రి బాలరాజుకు పాజిటివ్ ఇమేజ్ ఇచ్చిన విషయంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో ఇది ఎంత మేర స‌హ‌య పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: