గత మూడు–నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సహస్ర. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు ఛేదించబడింది. అందరూ అనుకున్నట్టుగానే ఆ బాలుడే ఆమెను హత్య చేసినట్లు తేలింది. పక్కింటి పదవ తరగతి బాలుడు కేవలం ఒక దొంగతనం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సహస్ర ఇంటికి వెళ్లిన ఆ బాలుడు, తాను దొంగతనం చేస్తున్నప్పుడు సహస్ర చూసిందన్న కారణంతో, ఆమె బయట పెట్టేస్తుందని భయపడి అతి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు.

దొంగతనం ఎలా చేయాలి..? ఇంట్లోకి ఎలా వెళ్లాలి..? తర్వాత ఎలా బయటకు రావాలి ..? అనే వివరాలను కూడా ఆ బాలుడు ముందే కాగితం మీద రాసుకున్నట్లు విచారణలో తెలిసింది. దొంగతనం చేసి బయటికి వస్తూ గ్యాస్ ఆన్ చేసి పెట్టాలని, దాంతో ప్రమాదం జరిగినట్లు కనిపించి మొత్తం కాలిపోయిందని అనుకునేలా ప్లాన్ చేసినట్లు బయటపడింది. అయితే ఆ రోజు సహస్ర ఇంట్లోనే ఉండడంతో అతని ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. హత్య జరిగిన రోజున అతని దుస్తులపై రక్తపు మరకలు కనిపించగా, వాటిని చూసిన నిందితుడి తల్లిదండ్రులు కూడా మౌనం వహించారు. అందువల్ల ఈ విషయం బయటపడలేదు. పోలీసులు విచారణలో భాగంగా సహస్ర ఇంటికి తరచూ వచ్చే  బాలుడిని కూడా ప్రశ్నించారు. కానీ అతను ఎలాంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాడు.

సీసీ కెమెరాల్లో బయటివారు ఎవరూ రాకపోవడంతో, పోలీసులు.. ఈ పని బిల్డింగ్‌లో ఉండే వారిలో ఎవరో చేశారని ఫిక్స్ అయ్యారు. అయితే అంత చిన్న బాలుడు ఇలాంటి పని చేస్తాడని ఊహించలేకపోయారు. ఇన్ని రోజులుగా విచారణ చేసినా, ఆ బాలుడు నిందితుడని గుర్తించలేకపోయారు. కానీ విచారణలో ఇచ్చిన ఒక సమాధానం పోలీసులు అతడినే నిందితుడిగా గుర్తించేలా చేసింది. ఆ బాలుడిని ప్రశ్నించగా, అతడు – “అంకుల్, సహస్ర నాకు బాగా తెలుసు. చాలా మంచిపిల్ల. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. ఆమె ‘డాడీ… డాడీ…’ అంటూ గట్టిగా అరవడంతో నాకు భయమేసింది” అని చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ ఈ విషయాన్ని చెప్పలేదు. దీంతో పోలీసులు తమదైన రీతిలో కఠినంగా విచారణ జరిపి అసలు నిజాన్ని బయటపెట్టారు. అదీ కాక, పక్కింట్లోనే ఉండే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆ రోజు సహస్ర ఇంటికి ఆ బాలుడు వెళ్లి వచ్చినట్లు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆడుతూ పాడుతూ సరదాగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి హత్య చేసి తమ భవిష్యత్తును తాము నాశనం చేసుకోవడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: