
ఇక మరోవైపు, ఈ పరిణామంలో కేటీఆర్ స్వయంగా కారు నడిపి, తన కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లికి వెళ్లడం ప్రత్యేక చర్చనీయాంశమైంది. గులాబీ దళం నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఆరోగ్యంపై క్షణక్షణం అప్డేట్స్ తెలుసుకుంటూ ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితమంతా కష్టనష్టాలను ఎదుర్కొంటూ పోరాటాలతో సాగించినా, గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం తరచూ సమస్యలు సృష్టించడం పార్టీ భవిష్యత్తుపై మసక వాతావరణం తీసుకొస్తోంది. కేసీఆర్ ఆరోగ్యంపై అధికారికంగా చెప్పిన సమాచారం మాత్రం పరిమితంగానే ఉంది. వైద్యులు “సోడియం లెవల్స్ తగ్గడం వల్లే ఇబ్బంది” అని వివరణ ఇచ్చినా, నిజమైన పరిస్థితి ఎవరికి తెలియడం లేదు. దీనివల్ల ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ క్యాడర్ అయితే “మా నాయకుడు త్వరగా కోలుకోవాలి” అని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తోంది.
ఇక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే – “కేసీఆర్ అనారోగ్యం తరచూ రావడం పార్టీ మానసిక స్థితిని దెబ్బతీస్తోంది. ఆయన నాయకత్వంలోనే గులాబీ దళం బలంగా నిలబడింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బలహీనమైతే, పార్టీ భవిష్యత్తు ఎటు దారితీస్తుందన్న ఆందోళన సహజమే” అని. ఏదేమైనా, కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఫాంహౌస్ చుట్టూ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నా, తరచూ ఇలా అనారోగ్య సమస్యలు రావడం గులాబీ దళానికే కాదు, తెలంగాణ రాజకీయాల్లోనూ పెద్ద చర్చగా మారింది.