జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దురదృష్టకర ఘటనపై సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. చేబ్రోలుకు చెందిన దొండపాటి శ్రీదుర్గా అనే మహిళ ప్రసవం తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పవన్ కళ్యాణ్ దృష్టికి రాగా, ఆయన నిన్న మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రసూతి వైద్య సేవల విషయంలో ఏ దశలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పని చేసే వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అనుభవజ్ఞులతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారం గురించి విచారణకు ఆదేశించాలని కోరారు. శ్రీదుర్గా మరణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జిల్లాలోని కొన్ని ఆసుపత్రుల తీరుపై కూడా కామెంట్లు చేశారు. జిల్లాలోని కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు తమ విశ్వాసాలను ప్రచారం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాంటి వాటికి వైద్య కళాశాలలను వేదిక చేయవద్దని ఆయన గట్టిగా కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ, శాసనమండలి విప్ పిడుగు రామరాజు పాల్గొన్నారు. వైద్య సేవల్లో నాణ్యత, నిబద్ధత అత్యంత ముఖ్యమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

ఆసుపత్రులలో  విశ్వాసాల ప్రచారంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రులు కేవలం రోగులకు చికిత్స అందించే పవిత్ర స్థలాలు తప్ప, వ్యక్తిగత విశ్వాసాలను ప్రచారం చేసే వేదికలు కాకూడదని ఆయన స్పష్టం చేశారు. వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని నిష్పక్షపాతంగా, నిబద్ధతతో నిర్వహించాలని, మతపరమైన కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగదని హితవు పలికారు. ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: