బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిగా వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) వ్యవస్థాపకుడు ముకేశ్ సహానీ మరోసారి చర్చనీయాంశమయ్యారు. 'సన్ ఆఫ్ మల్లా'గా తనను తాను అభివర్ణించుకునే ఈయన, ముఖ్యంగా నిషాద్ (మల్లా) సమాజ ఓట్లను ప్రభావితం చేయగల శక్తిగా బీహార్ రాజకీయాలను మలుపు తిప్పుతున్నారు.


ముకేశ్ సహానీ రాజకీయ ప్రయాణంలో 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపు. ఎన్నికలకు ముందు మహాగఠ్ బంధన్ (ఎంజీబీ) లో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించబడినప్పటికీ, సీట్ల పంపకం విషయంలో విభేదాలు రావడంతో హఠాత్తుగా ఎన్.డి.ఏ కూటమిలోకి జంప్ చేశారు. ఎన్.డి.ఏ కూటమి ఆయనకు 11 అసెంబ్లీ సీట్లు కేటాయించగా, ఆయన పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. అయినప్పటికీ, ఆయనకు నేరుగా డిప్యూటీ సీఎం పదవి దక్కలేదు. అయితే, బీజేపీ సిఫార్సు మేరకు ఆయన ఎమ్మెల్సీగా నియమించబడి, ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని పొందారు. కానీ, ఈ పదవి కేవలం 16 నెలలు మాత్రమే కొనసాగింది. పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపడం, ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసినా తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఆయన మంత్రి పదవిని కోల్పోయి, ఎన్.డీ.ఏ నుండి పూర్తిగా బయటకు వచ్చారు.

తాజా బీహార్ ఎన్నికల్లో ముకేశ్ సహానీ తిరిగి మహాగఠ్ బంధన్ వైపు అడుగు వేశారు. సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతూ, ఈసారి అసెంబ్లీ, మండలి స్థానాలతో పాటు రాజ్యసభ స్థానాల విషయంలో కూడా కొంతవరకు సర్దుబాటుకు వచ్చారని సమాచారం. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముకేశ్ సహానీ తన పార్టీ అభ్యర్థుల గెలుపుపై దృష్టి పెట్టేందుకు తానే నేరుగా పోటీ చేయడం లేదని కూడా ప్రకటించారు. ఆయన దృష్టి అంతా తన పార్టీని బలోపేతం చేయడం మరియు ఎంజీబీ విజయాన్ని సాధించడంపైనే ఉంది. బీహార్ రాజకీయాల్లో నిషాద్ సమాజానికి సమాన హక్కు, న్యాయం కల్పించాలనే తన ప్రధాన లక్ష్యం కోసం పోరాడుతున్నట్టు ఆయన పదే పదే ప్రకటిస్తున్నారు. యువ నాయకుడు తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా చూడాలనే సంకల్పాన్ని వ్యక్తం చేస్తూనే, ఉపముఖ్యమంత్రి పదవిపై కూడా తన ఆకాంక్షను చాటుకుంటున్నారు. కూటములను మారుస్తూ, ఎత్తులు వేస్తూ తన పార్టీ ఉనికిని, తన రాజకీయ శక్తిని నిలబెట్టుకోవడానికి ముకేశ్ సహానీ చేస్తున్న ప్రయత్నం బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: