తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ కలగంటోంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ కలకు తాత్కాలిక షాక్ ఇచ్చినట్టుగా మారుతోంది. గతంలో దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ చూపిన ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడు కనిపించడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. 2018 నుండి 2023 వరకు జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు చోట్ల విజయం సాధించి, మరో చోట గట్టిపోటీ ఇచ్చి ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే సమయంలో కమలం పార్టీ కేడర్ ఉత్సాహం, నేతల ఆత్మవిశ్వాసం ఉప్పొంగేవి. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు తగ్గిందనే అభిప్రాయం బయటపడుతోంది.
 

అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితమైన బీజేపీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బలమైన పునరాగమనం చేసింది. బీఆర్ఎస్‌ను వెనక్కు నెట్టి, కాంగ్రెస్‌తో సమానంగా 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. అయితే ఆ ఉత్సాహం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి ప్రచారం పెద్దగా ఆకట్టుకోవడం లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇది ప్రతిష్ఠాత్మక పోరు. 2014 నుండి నిరంతరం విజయాలతో దూసుకువస్తున్న ఆయనకు ఈ సారి పార్టీ ప్రతిష్ఠ పందెంగా మారింది. అయినా ప్రచారం స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోల్చితే బీజేపీ వెనుకబడి ఉందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పూర్తి స్థాయి యుద్ధ ప్రణాళికతో దిగింది.

 

ఇక ప్రతి డివిజన్‌కు ఇద్దరు మంత్రులను, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలను ఇన్‌చార్జిలుగా నియమించింది. బీఆర్ఎస్ కూడా కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. కానీ బీజేపీ తరఫున మాత్రం దీపక్ రెడ్డి చుట్టూ కొద్దిమంది నాయకులే తిరుగుతున్నారని తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ చూపిన ఆత్మవిశ్వాసం, మాస్ ప్రెజెన్స్ ఇప్పుడు కనిపించకపోవడంతో, పార్టీ కార్యకర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచార వేదికలపై కమలం పార్టీ నాయకుల హడావుడి తగ్గిపోవడంతో, ప్రత్యర్థులు బలంగా ఆడుతున్నారు. విపక్ష పార్టీగా తెలంగాణలో పట్టు సాధించాలంటే బీజేపీ మళ్లీ దుబ్బాక తరహా జోష్ తెచ్చుకోవాల్సిందే. లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీ ప్రతిష్ఠకే కాకుండా భవిష్యత్ ప్రస్థానానికీ పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: