జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సాధారణంగా చిన్న ఎన్నికలుగా కనిపించినా, తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది కేవలం ఒక స్థానానికి సంబంధించిన పోటీ కాదు, ఆయన నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి సంబంధించిన పరీక్షగా మారింది. “జూబ్లీహిల్స్ గెలుపే ప్రభుత్వానికి మద్దతు సంకేతం” అన్న నమ్మకంతో రేవంత్ ఈ పోరాటాన్ని తన వ్యక్తిగత ప్రతిష్టగా మార్చుకున్నారు. మినీ రిఫరెండం – ప్రజా తీర్పు ముందే .. 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి అదే ఉత్సాహంతో రంగంలోకి దిగారు.
 

బీఆర్ఎస్ నేతలు “ఈ ఉపఎన్నిక ప్రభుత్వ పనితీరుపై రిఫరెండం” అని ఎత్తి చూపడంతో, రేవంత్ కూడా దీన్ని “మినీ అసెంబ్లీ ఎన్నిక”గా తీసుకున్నారు. “ప్రజల తీర్పు మళ్లీ కాంగ్రెస్ వైపు రావాలి” అనే స్పష్టమైన లక్ష్యంతో ఆయన నేతలకు దిశానిర్దేశం ఇచ్చారు. ఈ ఎన్నిక ద్వారా ప్రభుత్వం చేసిన పనులు, సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎంత ప్రభావం చూపాయో కూడా పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కఠిన వ్యూహం .. జూబ్లీహిల్స్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి రూపొందించిన ప్రణాళిక కఠినంగా, కచ్చితంగా ఉంది. ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు అప్పగించారు. 7-8 పోలింగ్‌ బూత్‌ల బాధ్యతను ఒక మంత్రి లేదా రాష్ట్ర స్థాయి నేతకు ఇచ్చారు. ప్రతిరోజూ 250 ఇళ్లలో ఇంటింటి ప్రచారం తప్పనిసరి చేశారు.



 ప్రతి రాష్ట్ర నేత తన బృందంతో 20-30 మందితో కలిసి ప్రచారంలో పాల్గొనాలి. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలనే ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ఎంపీలు, నామినేటెడ్ నాయకులు ప్రతి రోజు ఫీల్డ్‌లోనే ఉండాలని స్పష్టంగా ఆదేశించారు. నవంబర్ 9 వరకు ఎవరూ కార్యాలయాల్లో కూర్చోవద్దని ఆదేశించారు. ఈ కఠినమైన మిషన్ వెనుక ఉన్న ఉద్దేశ్యం - ఓటు శాతాన్ని గరిష్ట స్థాయికి చేర్చడం, ప్రతి బూత్‌లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని స్థాపించడం. రాజకీయ మలుపు – రేవంత్ దృష్టి స్పష్టంగా..ఈ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది.

 

జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్‌కు మద్దతుగా వస్తే, అది రేవంత్ నాయకత్వానికి పెద్ద బూస్ట్ అవుతుంది. ఆయన పార్టీకి ఉత్సాహం, ప్రతిపక్షాలకు ఒత్తిడి రెండూ కలగవచ్చు. అందుకే ఈ పోరాటాన్ని ఆయన సాధారణంగా కాకుండా, రాజకీయ భవిష్యత్తును మలిచే యుద్ధంగా తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల నినాదం ఒక్కటే – “రేవంత్ పట్టుబడితే అంతే!” జూబ్లీహిల్స్ ఫలితం ఏ వైపు వాలుతుందో నవంబర్ 9 తెలుపుతుంది… కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం - ఈసారి రేవంత్ ప్లాన్ సాధారణం కాదు, మాస్టర్ స్ట్రోక్!

మరింత సమాచారం తెలుసుకోండి: