ఎందుకంటే రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. నిధులు కేటాయించి రోడ్లను సక్రమంగా సంరక్షించడం అధికారులు చేయాల్సిన పని. చేవెళ్ల రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం కూడా ఒక గుంత కారణంగానే జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్ గుంతలో పడటంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో పలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం తర్వాత కూడా ఆ గుంతను పూడ్చే ప్రయత్నం ఎవ్వరూ చేయకపోవడం రాష్ట్ర పాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజల ప్రాణాలతో రాజకీయ ప్రదర్శనలు చేయడం అనాగరికం. ప్రభుత్వం ఒకవైపు ఉచిత బస్సు పథకం పేరుతో కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేస్తోంది. కానీ రోడ్ల సంరక్షణకు మాత్రం రూపాయి కేటాయించడంలో వెనుకబడుతోంది. ఆర్అండ్‌బీ శాఖకు ఇచ్చే నిధులన్నీ ఇతర పథకాలకు మళ్లించడం వలన మౌలిక సదుపాయాలు పతనమవుతున్నాయి.
పథకాలు పాపులర్ కావొచ్చు కానీ, రోడ్లపై ప్రాణాలు పోతే అది పాలకుల వైఫల్యమే. ఇప్పుడు కర్ణాటకలో జరిగినదే తెలంగాణలో జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఆలస్యంగా అయినా మేలుకుని భారీ ఎత్తున రోడ్ల పునరుద్ధరణ చేపట్టింది. కానీ అప్పటికి ప్రజల నమ్మకం కోల్పోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా వెళ్తే ప్రజల ఆగ్రహం తప్పదు. మౌలిక సదుపాయాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది. రోడ్లు సక్రమంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, ఆర్థిక చైతన్యం పెరుగుతుంది. కాబట్టి, రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఉచిత పథకాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం అన్న భావనతో రోడ్ల నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాలి. లేకపోతే బెంగళూరును మించిన దుస్థితి హైదరాబాద్‌లో తప్పదనే భయాందోళనలు వ్యాపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి