బిహార్ రాష్ట్రంలో తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు ఉన్నారు.
ప్రధాన కూటముల ముఖ్యమంత్రి అభ్యర్థులు, ఉప ముఖ్యమంత్రులు సహా అనేక మంది కీలక నేతల రాజకీయ భవితవ్యం తొలి దశ పోలింగ్‌లోనే తేలనుంది. ఇండి కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి, డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌధరీ తారాపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. వీరితో పాటు మరో 14 మంది మంత్రులు ఈ తొలి విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాధారణంగా పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని సున్నిత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3 కోట్ల 75 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 10 లక్షల 72 వేల మంది కొత్తగా, తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువ ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల కమిషన్ ఈ దశ పోలింగ్ కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ కోసం సుమారు రెండున్నర లక్షల మంది పోలీస్ బలగాలను మోహరించారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా 1,000 కంటే ఎక్కువ స్పెషల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయడం విశేషం. ఈ తొలి విడత పోలింగ్ మొత్తం ఎన్నికల ఫలితాలపై, రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావాన్ని చూపనుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీఏకి అనుకూల ఫలితాలు వెలువడనున్నాయో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి