మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ రాజకీయ చర్చల కేంద్రంగా మారింది. కారణం బీజేపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి. మంత్రి పదవి రాకపోవడంతో ఆయనలో అసహనం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆయన ప్రవర్తన చూస్తుంటే, మునుగోడులో తానే "సీఎం" అన్నట్టుగా నడుచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రతీ పని, ప్రభుత్వం అమలు చేసే ప్రతీ నిర్ణయం తన అనుమతి లేకుండా జరగకూడదనే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు.ముఖ్యంగా మద్యం దుకాణాల అనుమతుల విషయంలో రాజగోపాల్ రెడ్డి సొంత నిబంధనలు పెట్టుకోవడం, వాటిని పట్టించుకోని వ్యాపారులపై హెచ్చరికలు జారీ చేయడం స్థానికంగా పెద్ద వివాదంగా మారింది.
మునుగోడులో దుకాణాల కోసం అప్లై చేసేవారు ముందుగా తన షరతులను అంగీకరించాల్సిందే అని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినా, తన ఆమోదం లేకుండా దుకాణాలు తెరవనివ్వబోమని చెప్పడం వివాదంగా మారుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు విషయంలో ఆయన తీసుకుంటున్న వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలుస్తూ, భూసేకరణను అడ్డుకోవడానికి రైతులను కూడగట్టి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా వ్యతిరేకత చూపించి పనులు ఆపించాలనే ఉద్దేశంతోనే ఆయన వ్యవహరిస్తున్నారనే భావన ఏర్పడుతోంది. మునుగోడు పరిధిలో రింగ్ రోడ్ వద్దని చెప్పడం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.
రాజగోపాల్ రెడ్డి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఆయన రాజకీయ లెక్కల్లోనే దాగి ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తనకు ప్రత్యామ్నాయంగా కొందరిని ప్రోత్సహిస్తున్నారని ఆయనకు అనుమానం ఉంది. అందుకే తన నియోజకవర్గంలోకి కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎవరూ రావొద్దని స్పష్టంగా చెబుతున్నారని సమాచారం. గతంలో నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోని ఆయన, ఇప్పుడు “నేను చేసే ప్రతిదీ ప్రజల కోసమే” అని చెప్పడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు మునుగోడు పైన దృష్టి సారించడంతో రాజగోపాల్ రెడ్డి అసహనం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి, మంత్రి పదవి రాకపోవడం రాజగోపాల్ రెడ్డి ఇలా అసహనం, అక్కసు వెళ్లగక్కుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి