సోష‌ల్ మీడియాలో తన ఆధ్యాత్మిక–జానపద గీతాలతో ఇప్పటికే సంచ‌ల‌నాన్ని సృష్టించిన మైథిలీ ఠాకూర్, ఇప్పుడు బీహార్ రాజకీయాల్లోనూ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అతిపిన్న వయస్కురాలిగా నిలిచి, ఘన విజయం సాధించింది. అలీనగర్ నియోజకవర్గం నుంచి భాజపా తరపున రంగంలోకి దిగిన ఆమె, స్థానిక ఆర్జేడీ సీనియర్ నేత వినోద్ మిశ్రాను సుమారు 11 వేల ఓట్ల తేడాతో ఓడించి తొలి సారి అసెంబ్లీకి అడుగుపెట్టింది. ముఖ్యంగా, 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత భాజపాకు ఇది మొదటి విజయం కావడం విశేషం.


సోష‌ల్ మీడియా వేదికల్లో మైథిలీ ప్రభావం అసాధారణం. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోయర్లు ఉండగా, ఫేస్‌బుక్‌లో మాత్రం ఏకంగా 1.4 కోట్ల మంది అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు. 2024లో ఆమె పాడిన ‘శబరి’ పాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రతిభకు ఆకర్షితులైన ప్రధాని స్వయంగా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. అదే ఏడాది ఆమె ‘టాప్ 24’ జాబితాలో స్థానం దక్కించుకుంది. అంతేకాదు, ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక కావడం ఆమె కళాత్మక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి.



మైథిలీ సంగీత నేపథ్యం ఎంతో బలంగా ఉంది. ఆమె తండ్రి రమేశ్‌ ఠాకూర్ ఒక శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, అలాగే సంగీత ఉపాధ్యాయుడు. చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పడం ప్రారంభించారు. తల్లి భారతీ గృహిణి. మైథిలీతో పాటు ఆమె సోదరులు అయాచీ, రిషబ్ కూడా సంగీతాన్ని నేర్చుకుని, కుటుంబ సంగీత యాత్రలో భాగమయ్యారు. వారి ఇంట్లో జరిగే సంగీత సాధన పొరుగువారికి అసౌకర్యంగా మారుతుండటంతో, ఆ కుటుంబం 17 సార్లు ఇళ్లు మార్చాల్సి వచ్చిందని మైథిలీ తల్లి భారతీ ఓ సందర్భంలో వెల్లడించారు. ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని ఎన్నో కష్టాల్లో జీవనం సాగించామని కూడా ఆమె చెప్పింది. చివరకు 2017లో కుటుంబం తన సొంత ఇల్లు కొనుగోలు చేయగా, 2020లో మరో మంచి అపార్ట్‌మెంట్‌కు మారింది.



మైథిలీ ఠాకూర్ సంగీత ప్రస్థానం కూడా ఎంతో వైభవంగా సాగింది. ఆమె ‘ఇండియన్ ఐడల్’లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ‘ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’ పోటీలో విజేతగా నిలిచింది. ‘రైజింగ్ సింగర్’ కార్యక్రమంలో రన్నరప్‌గా నిలిచి ప్రజాదరణను మరింత పెంచుకుంది. 2023లో ఎన్నికల సంఘం ఆమెను మధుబనీ జిల్లా బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఆ వెంటనే వచ్చిన సంవత్సరం ప్రధానమంత్రి మోదీ చేతులమీదుగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆమె ఎదుగుదలకు మరో గుర్తింపు ఇచ్చింది. సోష‌ల్ మీడియా వేదికలపై జానపద–భక్తి గీతాలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన మైథిలీ, ఇప్పుడు ఎన్నికల ద్వారానే ప్రజా సేవలో ప్రవేశించి కొత్త అధ్యాయం ప్రారంభించింది. కళాకారిణిగా మొదలై ప్రజా ప్రతినిధిగా ఎదుగుతున్న ఆమె ప్రయాణం ఎంతో మంది యువతలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: