క్లాస్‌రూమ్‌లో చపాతీ ఎలా చేయాలో చెప్పడం ఒకటి… కానీ అదే పని కిచెన్‌లో నిలబడి చేయడం మరోటి. థియరీ, ప్రాక్టికల్ మధ్య ఉండే ఈ తేడా రాజకీయాల్లో అయితే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తాజా ఉదాహరణ ప్రశాంత్ కిషోర్. దేశంలోనే నంబర్ వన్ రాజకీయ వ్యూహకర్తగా పేరు గాంచిన ఆయన స్వయంగా ఏర్పరచుకున్న పార్టీతో బీహార్‌లో ఎన్నికల బరిలో డిజాస్ట‌ర్ అయ్యింది. నేటి భార‌తీయ స‌మ‌కాలీన రాజకీయాల్లో ఆయనను ఆధునిక “కింగ్‌మేకర్”గా కీర్తించిన సందర్భాలు ఉన్నా… తన పార్టీ కోసం ఆయన ఓట‌ర్ల‌ను మెప్పించ లేక‌పోయారు. ప్రశాంత్ కిషోర్ .. పీకే పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యూహకర్త. రెండు గంటల సలహాలకు కోట్లు తీసుకుంటాడని చెప్పుకునే స్థాయి. అనేక రాష్ట్రాల్లో పాలన మార్చిన వ్యక్తిగా, ఎన్నో పార్టీలను గెలిపించిన వ్యక్తిగా ఆయనను బ్రాండింగ్ చేసుకున్నారు. కానీ ఇతరులకు బ్లూప్రింట్ ఇచ్చే వ్యక్తి, తన కోసం మాత్రం బ్లూప్రింట్ పనిచేయలేదు. ఇదే జనసురాజ్ పార్టీ ఫలితాల్లో స్పష్టమైంది.


243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 238 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన జనసురాజ్ పార్టీకి ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి. పీకే ప్రచారం చేసినంత హడావిడి, హైప్‌న‌కు సరిపోయే ఓటు శాతం రాలేదు. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ 10 % వరకూ ఓట్లు రావచ్చని అంచనా వేసినా… వాస్తవ ఫలితాల్లో 3 నుండి 5 శాతం మధ్య ఓటు షేర్‌కే పరిమితమైంది. అంతేకాకుండా, ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం పీకే పార్టీ చాలా చోట్ల నోటా కంటే కూడా వెనుకబడిపోయింది. ఇది పీకే బ్రాండ్‌కే భారీ దెబ్బగా భావిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు .. డిపాజిట్లు కూడా నిలబెట్టుకోలేకపోవడం జనసురాజ్ పార్టీ ప‌రువు పూర్తిగా తీసేసి న‌ట్లు అయ్యింది. అస‌దుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీ కూడా కనీసం ఒక సీటు గెలుచుకోగా, పీకే మాత్రం ప్రజల్లో అంగీకారం పొందలేకపోయారు. ఇది “ రాజకీయ వ్యూహకర్తగా ఉండడం ” మరియు “ ప్రముఖ ప్రజానాయకుడిగా ఉండడం ” మధ్యనున్న పెద్ద అంతరాన్ని గుర్తు చేసింది.


జన్ సురాజ్ పార్టీ ప్రతినిధులు మాత్రం ఈ ఫలితాలపై తాము చేసిన తప్పులను అంగీకరించారు. పార్టీకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లేకపోవడం, ... పీకే ఒక్కడే ఫేస్‌గా ఉండటం వల్ల మిగతా అభ్యర్థులు ముక్కూ మొఖం తెలియ‌ని నేత‌లు కావ‌డం వంటి అంశాలు తమ ఓటమికి కారణమని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే నేను మోడీని గెలిపించాను .. జ‌గ‌న్‌ను గెలిపించాను .. మ‌మ‌తా బెన‌ర్జీని గెలిపించాను అని చెప్పుకునే పీకే ఇప్పుడు ప్లాప్ అయ్యారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు చెప్పడం ఒకటి, ప్రజలను ఒప్పించడం మరోటి. పీకే ఉదాహరణ రాజకీయాల్లో థియరీ వ‌ర్సెస్ ప్రాక్టికల్ మధ్య ఉన్న అంతరాన్ని మళ్లీ రుజువు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: