- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ తీసుకున్న ప్రతి అడుగు వారికి వ్యతిరేకంగా పని చేసింది. మొదటి నుంచే బీజేపీ ఈ పోటీలో అంత సీరియ‌స్ గా లేదన్న భావన ఓటర్లలో బలపడింది. సాధారణంగా ఈ నియోజకవర్గంలో బీజేపీకి కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు స్థిరమైన ఓట్ల బ్యాంక్ ఉన్నట్లు గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. కానీ ఈసారి ఆ ఓట్లను కూడగట్టడం కూడా వారికి పెద్ద సవాలుగా మారింది. అభ్యర్థి ఎంపికలో పార్టీ చేసిన తప్పులు ప్రధాన కారణం. ఆరు నెలల ముందే సిద్ధం కావాల్సిన చోట, నామినేషన్లు ప్రారంభమైన తర్వాత గత ఎన్నికల అభ్యర్థినే మళ్లీ వ్యవహారంలోకి తెచ్చారు. ఈ నిర్ణయం పూర్తిగా ఆలస్యమైందని, ప్రజల్లో ఏ హైప్‌ కూడా క్రియేట్ కాలేదని నాయకులే ఒప్పుకుంటున్నారు.


 ప్రచార సమయంలో కూడా తిరుగుబాటు స్వభావం కనిపించింది. బండి సంజయ్ దూకుడు ప్రచారం చేయగలరన్న నమ్మకం ఉన్నప్పటికీ, ఆయనను పక్కన పెట్టి కిషన్ రెడ్డిని ముందుకు తేవడంతో ప్రచారం ప్రభావం మరింత తగ్గిపోయింది. దీంతో పోటీ ద్విముఖంగా మారి కాంగ్రెస్ - బీఆర్‌ఎస్ మధ్యే జ‌రిగింది. బీజేపీకి స్పష్టమైన దిశ లేకపోవడంతో ఓటర్లు కూడా వారిని ప్రధాన రేసులో చూడలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు పదేపదే ఎత్తి చూపారు. బీజేపీ డిపాజిట్ కూడా రాదని చేసిన సవాళ్లకు బీజేపీ వైపు నుంచి ఎలాంటి ధైర్యవంతమైన ప్రతిస్పందన రాకపోవడం వారు కూడా లోపలి అనుమానాల్లో ఉన్నట్లు చూపించింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బీజేపీకి 25 వేల ఓట్లు వ‌చ్చాయి.. పైగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌లో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డికి ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి 40 వేల పై చిలుకు ఓట్లు ప‌డ్డాయి. కానీ ఈ సారి కేవ‌లం 17 వేల ఓట్లు తో డిపాజిట్ కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి.


మ‌రి ఇంత గ‌ట్టి పోటీ ఉన్న పోరులో డిపాజిట్ తెచ్చుకోలేని పార్టీ రేప‌టి రోజు తెలంగాణ లో ఎలా అధికారంలోకి వ‌స్తుంది ? ఆ పార్టీది ఎప్ప‌ట‌కీ ఈ స్టేట్‌లో మేక‌పోతు గాంభీర్య‌మేనా అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ .. బీజేపీకి సహకరించిందని విమర్శించేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి తారుమారైంది. అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీయే .. బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహకరించినట్లుగా రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, బీజేపీ వ్యూహాలు క్లారిటీ లేకుండా ఉండటం, సమయస్ఫూర్తి లోపించడం, అభ్యర్థి ఎంపికలో జాప్యం అన్నీ కలిసి పార్టీ పరువు పోగొట్టేలా చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: