- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

బీహార్ ఎన్నికలు ముగియడంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చర్చ  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురించి. కాంగ్రెస్‌కు బిహార్‌లో ఘోర పరాభవం ఎదురైనా.. ఖర్చు మాత్రం తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జేబు నుంచి వెళ్లిందన్న గుసగుసలు. ఈ ఎన్నికలను పార్టీ తిరిగి నిలబడే అవకాశంగా చూసిన హైకమాండ్, అందుకు సహకరించాలనే ఉద్దేశంతో పొంగులేటి ముందుకు వచ్చారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం ప్రకారం, బీహార్ ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి పొంగులేటి స్వయంగా ఆసక్తి చూపారని అంటున్నారు. హైకమాండ్ నేత మల్లికార్జున ఖర్గే దగ్గర మాట తీసుకుని, ఆఖరికి బీహార్ ఎన్నికల వ్యూహం, ఖర్చు, మేనేజ్‌మెంట్ అన్నీ తనే చూసుకుంటానని చెప్పి రంగంలోకి దిగారన్న వార్తలు వినిపిస్తున్నాయి.


ఢిల్లీ లోని ఒక ప్రైవేట్ లొకేషన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి, అక్కడ నుంచే అన్ని నియోజకవర్గాల ప్రచారాన్ని పర్యవేక్షించారనే సమాచారం కూడా బయటకు వచ్చింది. కాంగ్రెస్ పోటీ చేసిన 61 స్థానాల్లోనూ ప్రచారం, వనరులు, మానవ వనరులు– అన్నిటికీ సమన్వయం చేసినట్లు అంటున్నారు. ఆర్జేడీతో అంతగా సమన్వయం కనిపించకపోయినా, కాంగ్రెస్ అభ్యర్థుల కోసం మాత్రం ఆయన విస్తృతంగా పనిచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో ఎన్నికల ఖర్చులు ఎంత భారీగా ఉంటాయో తెలిసిందే. కానీ బీహార్ లాంటి రాష్ట్రంలో ఆ స్థాయి ఖర్చు అవసరం ఉండదన్నది విశ్లేషకుల వ్యాఖ్య. అంతైనా ఈ ప్రచార యుద్ధంలో రెండు, మూడు వందల కోట్లు ఖర్చై ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.


ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌కు అనుకున్నట్లుగా రాకపోవడంతో పొంగులేటి పెట్టిన భారీ ఖర్చు అందరి దృష్టిలో పడింది. ఈ నేపథ్యంపై సోషల్ మీడియాలో "పొంగులేటి జేబు ఖాళీ అయిపోయినట్లే" అనే సెటైర్లు, మీమ్స్ కూడా వైరల్‌ అయ్యాయి. అయితే మరోవైపు, పార్టీ కోసం ఈ స్థాయిలో ఫైనాన్సింగ్ చేయడం వల్ల హైకమాండ్ ఆయనపై ప్రత్యేకంగా సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందన్న మాట కూడా వినిపిస్తోంది. అది నిజమయితే, బీహార్ ఫలితాలు అనుకూలంగా రాకపోయినా, పొంగులేటి తన పెట్టుబడికి రాజకీయ లాభం మాత్రం దక్కించుకున్నట్లే అవుతుందని విశ్లేషకుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: