- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రింత పెద్ద న‌గ‌రంగా విస్త‌రించ‌నుంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ విస్త‌ర‌ణ‌కు సంబంధించి తాజా కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగ‌ళ‌వారం జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి, పట్టణీకరణ, విద్యుత్‌ రంగానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ విస్తరణ ప్రతిపాదనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ పరిధిలోకి విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిపాలనా పరిధి మరింత విస్తరించనుంది.


ఒక‌టి కాదు .. రెండు కాదు ఏకంగా 27 మున్సిపాల్టీలు గ్రేట‌ర్ లో విలీనం కానున్నాయి. పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, తుర్కయంజాల్, శంషాబాద్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, దమ్మాయిగూడ, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం వంటి మున్సిపాలిటీలు గ్రేట‌ర్ లో విలీనం కానున్నాయి. దీంతో నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం లభించనుంది. ఇక విద్యుత్‌ రంగంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటు చేయాలని ఆమోదం తెలిపింది. దీని పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్స్‌ ఉండనున్నాయి. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది.


అదేవిధంగా రాష్ట్రానికి అవసరమైన పారిశ్రామిక, వ్యవసాయ, గృహ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు కేబినెట్‌ అనుమతి ఇచ్చింది. పునరుత్పాదక శక్తి రంగాన్ని ప్రోత్సహించే ఈ అడుగు రాష్ట్రానికి దీర్ఘకాలంలో భారీగా లాభిస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా, ఈ కేబినెట్‌ సమావేశం రాష్ట్ర భవిష్యత్తు పాలన, అభివృద్ధిపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలకు వేదికైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: