ఒంటరి పోరాటంలో సింగిల్ డిజిట్ ఓటు షేర్! .. గత కొన్ని దశాబ్దాల చరిత్ర చూస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజన తర్వాత కానీ ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే సింగిల్ డిజిట్ ఓటింగ్ శాతానికే పరిమితమైంది. టీడీపీ, జనసేన వంటి మిత్రపక్షాల అండదండలు ఉంటేనే పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగింది. సొంతంగా బీజేపీకి క్రింది స్థాయి నుంచి బలమైన కేడర్ లేకపోవడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో రాష్ట్ర నాయకత్వం విఫలం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా పరిశీలకులు చెబుతున్నారు.
అగ్ర నాయకులే ఉన్నా.. ఫలితం శూన్యం! .. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నాయకత్వానికి కొదవ లేదు. వెంకయ్య నాయుడు వంటి దిగ్గజాలు, కంభంపాటి హరిబాబు, సోము వీర్రాజు, పురంద్రీశ్వరి వంటి జనాకర్షణ ఉన్న నాయకులు, సామాజిక వర్గాల అండదండలు ఉన్న నేతలు ఉన్నారు. అయినా, వీరెవ్వరూ బీజేపీని ఒక్క నియోజకవర్గంలో కూడా ఒంటరిగా గెలిచేంత బలంగా తీసుకెళ్లలేకపోవడంపై అంతర్మథనం జరగడం లేదు. కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగించినా ఫలితం శూన్యమేనన్న అసహనం ఢిల్లీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర నాయకత్వంలో తీవ్రమైన అసహనం! .. ఎప్పటికీ ఇతరులపై ఆధారపడి రాజకీయాలు చేయడంపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే, ఏపీని తమ అభివృద్ధి జాబితా నుంచి తాత్కాలికంగా తొలగించినట్లేనని పలువురు భావిస్తున్నారు. అయితే, పార్టీని పూర్తిగా వదిలేయకుండా, త్వరలోనే కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలను పిలిచి ఈ వైఫల్యాలపై గట్టిగా క్లాస్ పీకే అవకాశాలు ఉన్నాయని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం కల్పించుకున్నా, స్థానిక నాయకత్వంలో చలనం వస్తేనే ఏపీలో కమలం పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే, ఎన్ని కూటములు, పొత్తులు ఉన్నా... బీజేపీ సొంత బలహీనత అలాగే ఉండిపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి