కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి పథకానికీ చంద్రబాబు పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అందలోనూ ముఖ్యంగా కాపులకు సంబంధించిన భవనాలకు చంద్రన్న కాపు భవన్ అని పేరు పెట్టడంపై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనూ చూద్దాం.. 

.. ప్రతీ పథకానికి కూడా చంద్రన్న అని పేరు పెడుతున్నారు.. కాపు భవనాలకు కూడా చంద్రన్న కాపు భవనాలు అని పెడుతున్నారు.. ఇది చాలా దురదృష్టకరం.. రాష్ట్ర ఆస్తిలోనూ, ఆదాయంలోనూ కూడా మా జాతి వాటా కూడా ఉంది. మా ఆస్తులపై మీ పేర్లు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత మాకు లేదు. వెంటనే ముఖ్యమంత్రి పేరును పథకాలపై, భవనాలపై తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాం..అంటూ ఫైరయ్యారు ముద్రగడ. 

కాపు భవనాలకు కమ్మ నేత పేరు ఎందుకు.. ? - ముద్రగడ


కాపు జాతి బానిస జాతి అనే ఆలోచన మీ మెదడు నుంచి తొలగించండి. అలాగే ఆత్మ గౌరవం అనేది మీ ఒక్కరికే కాదు సమాజంలో అందరికీ ఆత్మగౌరవం అవసరమన్నది ముఖ్యమంత్రి గమనించాలి. కమ్మ భవనాల ముందు కాపు కమ్మ భవనం అని రాయిస్తే మీరు ఒప్పుకుంటారా. ఆగస్టులోగా కాపులను బీసీల్లో చేర్చకపోతే మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది.

ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగారు మా జాతి కోసం ఎన్నో వరాలు కురిపిస్తున్నారు అంటూనే మీరు కురిపించే ఈ వరాలు మా ప్రధాన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని బీసీల్లో చేర్చాల్సిన ఆవశ్యకత ముఖ్యంగా ఉందని గుర్తు చేశారు. రాజ్యాధికారం వల్ల నాలాంటి తెల్లచొక్కవాళ్లకే న్యాయం జరుగుతుంది తప్ప సామాన్యులకు, అత్యంత పేదవారికి న్యాయం జరగడం లేదు. 

ఉద్యమంలో నాకు సహకరించిన నాయకులను, స్నేహితులను సన్నిహితులను కలవడం కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను. అందులో భాగంగానే త్వరలోనే చిరంజీవిని, దాసరి నారాయణరావు, పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, బొత్స కూడా ఉద్యమంలో సహకరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంది... అంటున్నారు ముద్రగడ పద్మనాభం.  



మరింత సమాచారం తెలుసుకోండి: