నవరత్నాలు కొనసాగిస్తానంటున్న జగన్‌

జగన్‌ను మించి పథకాలు ప్రకటించిన బాబు

సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో సాధ్యమా?

ఇద్దరిలో ఓటరు ఎవరిని నమ్ముతాడో?


ఏపీ ఓట్ల రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నామినేషన్లు ఉప సంహరణ ముగిసింది. అభ్యర్థులు ఎవరో తేలిపోయారు. ఇక పోలింగ్‌కు పట్టుమని పది రోజులు కూడా లేవు. పోలింగ్‌కు ముందు అత్యంత కీలకమైన దశ ఇదే. ఓటరు తన ఓటు ఎవరికి వేయాలో ఆలోచించుకునే సమయం వచ్చేసింది. ఈ సమయంలో అటు జగన్‌, ఇటు చంద్రబాబు.. ఇద్దరి మేనిఫెస్టోలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.



ఇటీవల వైఎస్‌ జగన్‌ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గత ఎన్నికల ముందు నవరత్నాలు అంటూ ఊరించిన జగన్.. ఈసారి ఇంకెన్ని హామీలు ఇస్తారో అని జనం ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ మాత్రం కొత్త పథకాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పటికే ఉన్న నవరత్నాల పథకాలనే కొనసాగిస్తానని చెప్పారు. ఇప్పటికే ఉన్న కొన్ని పథకాల నగదు పెంచారు. రైతులకు రూ.16వేలు ఇస్తామన్నారు. పెన్షన్‌ 2028నాటికి 3250.. 2029 నాటికి 3500 పెంచుతామన్నారు. అమ్మవడి కూడా  రూ. 2000 మాత్రమే పెంచారు.



ఇందుకు భిన్నంగా చంద్రబాబు మాత్రం ఇప్పటికే సిక్స్ గ్యారంటీలు అంటూ ఊరిస్తున్నారు. రైతులకు జగన్ 16 వేలు ఇస్తానంటుంటే.. చంద్రబాబు మాత్రం ఏకంగా రూ. 20 వేలు ఇస్తానంటున్నాడు. జగన్ పెన్షన్‌ ఇప్పట్లో పెంచను.. చివరి రెండేళ్లలోనే రెండు విడతలుగా అదీ 500 మాత్రమే పెంచుతానంటుంటే.. చంద్రబాబు మాత్రం ఏకంగా రూ. 4000 ఇస్తానంటున్నాడు. అది కూడా ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తానని ఊరిస్తున్నారు. ఇక అమ్మవడినే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తానని చంద్రబాబు ఆశలు రేపుతున్నారు. అంతేనా.. మహిళలకు నెలకు రూ. 1500, ఇంకా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తానని చంద్రబాబు ఇప్పటికే సిక్స్ గ్యారంటీల్లో చెప్పేశారు.



అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. చంద్రబాబు ఈ సిక్స్ గ్యారంటీలు ఎప్పుడో ప్రకటించారు. దాదాపు 9 నెలల ముందే ఈ ఆరు గ్యారంటీలు చెబుతూ వస్తున్నారు. అయినా ప్రజల్లో పెద్దగా ఊపు కనిపించలేదు. చంద్రబాబు హామీల విషయంలో ప్రజలను అంతగా ఊరిస్తున్నా జగన్ మాత్రం సంయమనం పాటించడం విశేషం. ఓవైపు అనేక సర్వేల్లో కూటమిదై పై చేయి అని రోజూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కూడా జగన్‌.. తాను చేయలేనివి చెప్పనని తెగేసి చెప్పేశారు. ఇక రెండు పార్టీల మేనిఫెస్టోలు ముందున్న సమయంలో ఇప్పుడు ఏపీ ఓటరు ఏం నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.



ఇక్కడ ఓ విషయం గమనించాలి. జగన్‌ది మొదటి నుంచి సంక్షేమమే ప్రధాన ఎజెండా. ఎన్నికల ముందు ఆయన అదే చెప్పారు. వైఎస్‌ఆర్‌ పథకాల వారసత్వం కొనసాగిస్తానన్నారు. అందుకు అనుగుణంగానే నవరత్నాలు డిజైన్‌ చేశారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలు కూడా దాన్ని నమ్మారు. ఎన్నడూ లేనంతగా ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌.,. తన మేనిఫెస్టోనే భగవద్గీత అంటూ దాని అమలుకే ప్రయత్నించారు. లక్షల కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చు చేశారు. ఈ సమయంలో ఆయన అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం. మద్యపాన నిషేధం అమలు, సీపీఎస్‌ రద్దు వంటి హామీలు మాత్రం నెరవేర్చలేక పోయారు. తన పథకాల ప్రాధాన్యాలే తాను చూసుకున్నారు. ఏం చేస్తానని చెప్పారో అదే చేశారు. ఆ విషయంలో జగన్‌కు ప్రజల్లో విశ్వసనీయత ఉందనే చెప్పాలి.



ఇక ఇప్పుడు చంద్రబాబు విషయానికి వస్తే.. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఈ పథకాలన్నీ బటన్‌ నొక్కుడు పథకాలని విమర్శించారు. ఇలాంటి పథకాలతో జగన్‌ రాష్ట్రాన్ని శ్రీలంకలా దివాళా తీయిస్తున్నాడని విమర్శించారు. బటన్‌ నొక్కడం తప్ప జగన్‌ అభివృద్ధి చేయట్లేదని చెప్పారు. డబ్బు పంచి పెట్టి ఓట్లు సంపాదించుకోవడం గొప్ప కాదని విమర్శించారు. జగన్ ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడని కూడా విమర్శించారు. అభివృద్ధి ఎలా చేయాలో, పరిశ్రమలు ఎలా రప్పించాలో తనకు తెలుసన్నారు.



జగన్‌ను పథకాల విషయంలో అంతగా విమర్శించిన చంద్రబాబు.. ఎన్నికల విషయానికి వచ్చే సరికి మళ్లీ ప్లేటు ఫిరాయించేశారు. ఉచిత పథకాలు రాష్ట్రాన్ని దివాలా తీయిస్తాయన్న ఆయనే.. ఇప్పుడు జగన్‌  పథకాలను మించి మరిన్ని పథకాలు అమలు చేస్తానంటున్నాడు. ఇప్పటికే రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉందన్న స్పృహతో జగన్‌ కొత్త హామీలు ఇవ్వడానికి సంకోచిస్తే.. జగన్‌ పథకాలకు తోడు మరిన్ని ఉచితాలు అమలు చేస్తానని చంద్రబాబు అంటున్నారు.



మరి అందుకు డబ్బు ఎక్కడిదని అడిగితే.. సంపద సృష్టి తనకు తెలుసని చెబుతున్నారు చంద్రబాబు. అంతే కాదు.. జగన్‌ మళ్లీ వస్తే.. ఆయనకు సంక్షేమ పథకాలు అమలుపైనేై ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ చంద్రబాబు విషయం అలా కాదు. చంద్రబాబు మళ్లీ వస్తే ఆయన చెబుతున్న సిక్స్ గ్యారంటీలతో పాటు రాష్ట్రాభివృద్ధిపై అంచనాలు ఉంటాయి. అమరావతిని నిర్మించాలి. పోలవరం కట్టాలి. మరి అటు జగన్‌ను మించి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, ఇటు అమరావతి నిర్మాణం, పోలవరం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే.



తాను సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబుతుంటారు. అయితే.. గతంలో ఆయన పాలింటిన 2014-19 కాలంలో ఏమాత్రం సంపద సృష్టించారని ఇటీవల జగన్‌ మేనిఫెస్టో విడుదల రోజు ప్రశ్నించారు. ఆ అయిదేళ్లూ రాష్ట్రం అప్పుల్లోనే ఉందని లెక్కలతో వివరించారు. అంతే కాదు.. చంద్రబాబు హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేసిన చరిత్ర లేదని గుర్తు చేశారు. అందుకు ఉదాహరణగా 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు చేస్తానని చెప్పి చేయని అనేక హామీలను గుర్తు చేశారు. జనం ఇప్పటికే చంద్రబాబు పాలనను 14 ఏళ్లు చూశారు. జగన్ పాలనను ఐదేళ్లు చూశారు. ఇద్దరి చరిత్రలు జనం ముందు ఉన్నాయి. ఇక ఓటు ఎవరికి వేయాలో ఆలోచించుకోవాల్సింది ప్రజలే.

మరింత సమాచారం తెలుసుకోండి: