బడుగు,బలహీనవర్గాల విద్యార్థులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికిని అనుకున్న ఫలితాలు రావడం లేదు. చదువు”కొన “లేని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, వసతి గృహాలతో పాటు ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసింది. ఇందుకు గాను విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు హాస్టళ్లలో కావాల్సిన సిబ్బందిని నియమించారు. ముఖ్యంగా విద్యార్థుల బాగోగులను చూసుకోవడం కోసం వార్డెన్లను నియమించడం జరిగింది. హాస్టళ్లలో అన్ని సౌకర్యాలున్నప్పటికిని విద్యార్థులు చదువులో మంచి మార్కులు ఎందుకు సాధించలేకపోతున్నారనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసతిగృహాల్లో ఉన్నటువంటి వార్డెన్లు ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసిన వారే కావడంతో పాటు విధ్యార్థులు చదువుకునే పాఠశాలల్లో సైతం ప్రభుత్వం సెలక్షన్ కమిటీలు నిర్వహించి వడపోసి ఎంపిక చేసినటువంటి ఉపాధ్యాయులుంటారు. ఇటువంటి సందర్భంలో విధ్యార్థులు చదువులో రాణించడంతో పాటు మంచి ఫలితాలు సాధించాలి. కాగా ఏదో ఒకరిద్దరు విధ్యార్థులు మినహాయించి మంచి ఫలితాలు సాధించక పోవడం వెనుక లోపాలు ఎక్కడున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతుంది. వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థులు చదువుకునే విధంగా కృషిచేయాల్సింది పోయి అందుబాటులో ఉండడంలేదనే విమర్శలుండగా ఈవిషయంలో ప్రభుత్వం ఎందుకు కృషిచేయడం లేదనే విమర్శలున్నాయి. శిక్షణ పొందని ఉపాధ్యాయులతో చాలిచాలని జీతాలు చెల్లించుకుంటూ ప్రైవేట్ హాస్టళ్లు నిర్వహించే యాజమాన్యం మంచిఫలితాలు సాధిస్తూ ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వ వసతిగృహాల్లో మంచి ఫలితాలు రాక పోవడంలో లోపాలు ఎక్కడున్నాయనేది గుర్తించాల్సిన అవసరముంది. ఈవిషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అంతుపట్టడంలేదు. ఇప్పటికైనా యంత్రాంగం వసతిగృహాలపై దృష్టి సారించి వసతిగృహాల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: