హైదరాబాద్: రాష్ర్టపతి ఎన్నిక ముగిసింది. దేశ 13వ రాష్ర్టపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ర్టపతి ఎన్నిక ముగిసిన తరువాత కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ర్టంపై ద్రుష్టిని పెడుతారనీ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు అందరూ ఇదే భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం గంపెడు ఆశతో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలవగానే తెలంగాణపై తేలుస్తామనీ రాష్ర్ట నాయకులకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు అధిష్టానం హామీ ఇచ్చినట్లు చెబుతూ వచ్చారు. దీనితోనే తాము రాష్ర్టపతి ఎన్నికల్లో పాల్గొన్నట్లు నిన్నటి వరకు టీ ఎంపీలు చెప్పుకున్నారు. వారు చెబుతూ వస్తున్నట్లుగా రాష్ర్టపతి ఎన్నిక ప్రక్రియ, ప్రమాణ స్వీకారం అన్నీ ముగిశాయి.
ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్,మంత్రి కె.జానారెడ్డి, ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి హస్తినలో మకాం వేశారు. ముఖ్యమంత్రి మార్పు అయితే సీఎం పదవీ కోసం కొందరు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే, ఎంపీలు మాత్రం ముఖ్యమంత్రి మార్పు కాదు తమకు తెలంగాణ రాష్ర్టం కావాలంటున్నారు. తెలంగాణపై కేంద్రం తేల్చినట్టే తేల్చి మళ్లీ బ్రేక్ వేసింది. ఇక ఇప్పుడు, అప్పుడూ అంటూ నానుస్తూ వస్తోంది. ఉత్తరాది ఎన్నికలనీ, రంజాన్ అని, పార్లమెంటు సమావేశాలనీ, ఉప ఎన్నికలనీ, రాష్ట్రపతి ఎన్నికలంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏదో ఒక్కటి తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందనీ, ఇంకా పెండింగ్ లో పెట్టడం వల్ల లాభంకంటే నష్టమే అధికమనీ ఢిల్లీ వెళ్లిన తెలంగాణకు చెందిన ప్రతి నాయకుడూ అధిష్టానం చెవిలో వేస్తున్నాడు.
రాష్ర్టపతి ఎన్నిక ముగియడంతోనే అందరూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మరి కొందరూ క్యూలో ఉన్నారు. అందరూ సోనియమ్మ దర్శనం కోసం అర్జీలు పెట్టుకున్నారు. అధిష్టానం చెప్పినట్లుగా రాష్ర్టపతి ఎన్నిక తతంగమంతా ముగిసిందనీ, తమ సంగతి తేల్చాలంటూ టీ ఎంపీలు కోరుతున్నారు. అధిష్టానం ముందునుంచీ చెబుతూ వస్తున్నట్లుగా తెలంగాణను తేలుస్తారా? లేక బుజ్జగింపులతో సరిపెట్టి ఇంటికి పంపిస్తారా? విభజనకు మొగ్గుచూపకుండా ముఖ్యమంత్రి పదవీ ఇస్తామనీ సర్దిచెప్పి పంపిస్తారా? అనే దానిపై జోరుగా ప్రచారం సాగుతోంది.
మొత్తానికి తెలంగాణ అంశాన్ని ఓ కొలిక్కి తెస్తారానే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానంపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ మదిలో ఏముందో మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: