హైదరాబాద్: రాయలసీమపై రాష్ర్టంలోని అన్ని ప్రధాన పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలనీ రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండు చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధ్రుతం చేసేందుకు ఈ నెల 4నుంచి ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు. తొలుత నిరాహార దీక్షలతో తన పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. రాయలసీమ ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా నిర్ణయం చేయడానికి పావులు కదుపుతున్నారనీ, ఇక ఇప్పుడు కూడా తాను చూస్తూ ఊరుకుంటే తమ ప్రాంత ప్రజలకు మరింత అన్యాయం చేసినట్లే అవుతుందంటున్నారు. తాను చేపట్టే ఉద్యమం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగితే, అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు వెనకాడబోననీ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. బైరెడ్డి రాయలసీమ కోసం నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించడంతో టీడీపీలో మళ్లీ ప్రాంతీయ లొల్లి మొదలైంది. రాష్ర్టంలోని అన్ని ప్రధాన పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇస్తే దాంట్లో రాయలసీమ గురించి కూడా ప్రస్తావించాలనీ బైరెడ్డి డిమాండు చేస్తున్నారు.  టీడీపీ కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వనున్నట్లు వార్తొలస్తున్న క్రమంలో అదే పార్టీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతీయ వాదాన్ని భుజాన వేసుకున్నారు. రాష్ర్టాన్ని వుంచితే సమైక్యంగా ఉంచండి, లేదంటే రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయాల్సిందేనంటూ బైరెడ్డి స్వరాన్ని పెంచారు. తెలంగాణపై ఢిల్లీలో కాంగ్రెస్ కసరత్తులు చేస్తుందనీ, టీడీపీ కూడా తెలంగాణకు అనుకూలంగా మరోమారు కేంద్రానికి లేఖ ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాష్ర్టాన్ని విభజనకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. రాష్ర్ట విభజనకు టీడీపీ లేఖ ఇస్తే తాను పార్టీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉన్నఫలంగా బైరిడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రాంతీయ లొల్లిని అందుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  బైరెడ్డి తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడుతున్నాడా? లేక ఆయనను ఎవరైనా వెనక నుంచి నడిపిస్తున్నారా? అనే దానిపై కూడా పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ మాత్రం చంద్రబాబే ఈ కొత్త నాటకానికి తెరలేపారనీ అంటోంది. బాబు ఆడిస్తున్న నాటకంలో బైరెడ్డి ఎపిసోడ్ ఒకటనీ టీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాస్త ఘాటుగానే మాట్లాడారు. బైరెడ్డి రాయలసీమ ఉద్యమాన్ని చేపట్టడం వెనక పూర్తిగా చంద్రబాబు ఉన్నారనీ ఆయన అంటున్నారు. బాబు రెండు కళ్ల సిద్దాంతం బహిర్గతమైందన్నారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు ఇప్పడు మళ్లీ కొత్త నాటకానికి తెరలేపారనీ, బాబు ఆడిస్తున్న కొత్త నాటకాన్ని ప్రజలంతా గ్రహిస్తున్నారనీ, తగు మూల్యం చెల్లించుకునే రోజులు ఎంతో దూరంలో లేవనీ టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలా ఉంటే, తెలుగువారందరమూ కలిసి ఉందామనడంతో తాము కలిశామనీ, ఇదే తమ ప్రాంత కొంపను ముంచిందనీ బైరెడ్డి వాపోతున్నారు. ఫ్యాక్షనిస్టులుగా ముద్ర వేసి రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా చేశారనీ అంటున్నారు. తమకు ఇప్పటికే ఎంతో అన్యాయం జరిగిందనీ, మరోమారు అన్యాయం జరుగుతుంటే తాను చూస్తూ ఊరుకోనంటున్నారు. రాష్ర్టం తప్పనిసరి పరిస్థిత్లుల్లో విడిపోతే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడుగా విభజించాలనీ డిమాండు చేస్తున్నాడు. తాము ఇక ఎవరితో కలబోమన్నాడు.  రాయలసీమను ప్రత్యేక రాష్ర్టంగా చేస్తేనే సరి లేదంటే పరిణామాలు మరో విధంగా ఉంటాయంటున్నాడు. రాయలసీమలో ఖనిజ సంపదకు, జలవనరులకు ఢోకా లేదనీ, రాష్ర్టంలో ఎక్కడా లేనటు వంటి యురేనియం సంపద రాయలసీమలో వుందనీ, ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడితే తామే ఎంతో అభివ్రుద్ది చెందుతామన్నారు. రాయల తెలంగాణకు కూడా తాము ఒప్పుకోమన్నారు. ఉంటే ఒకటిగా ఉంచండి, లేదంటే రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేయల్సిందేనంటున్నాడు. ఈ దఫా తమకు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం ఊరుకోమని బైరెడ్డి హెచ్చరించారు. దీనికి తగ్గట్టుగానే ఆయన ఉద్యమ కార్యచరణను రూపొందించుకుంటున్నారు. నాలుగు రోజుల పాలు నాలుగు జిల్లాలను కలుపుకుంటూ దీక్షా కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. మొత్తానికి బైరెడ్డి రాయలసీమ ప్రత్యేక రాష్ర్టం కోసం తలపెట్టిన ఉద్యమం రాజకీయ వర్గాల్లో బాగానే దుమారాన్ని రేపుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: