పాఠశాలలు మొదలై రెండు నెలలు గడిచిపోయాయి. వసతుల గూర్చి ఇప్పుడు ఆలోచించారు. దొంగలు పడ్డాక ఆరు నెలలకు... అన్న సామెత ఇన్నాళ్లు పోలీసులకోసమే అనుకున్నవారికి ఇప్పుడది తప్పని,మన పాలకులకూ అది వర్తిస్థుందని దీంతో తెలుసుకున్నారు. పైకప్పులు లేని తరగతి గదులు, తడసిన గోడలతో ఎప్పుడు కూలుతాయో తెలియని పాఠశాల భవనాలు, చెట్టు,పుట్టలతో పాములు,తేళ్ల తో సహవాసం చేసే రీతిలో ఉన్న ప్రాంగణాలతో చదువులంటేనే చాలా దూరం పారిపోతున్న విధంగా ఉన్న పాఠశాలలు లేని జిల్లాలు లేవు. ఇక మరుగుదొడ్లు,తాగునీరు,విద్యుత్ వంటి మౌలిక వసతులా...అవంటే ఏమిటో కూడా తెలియని విధ్యార్థులు,తల్లిదండ్రులున్న ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఫోటోలతో పత్రికలు, వీడియోలతో చానళ్లు ప్రతిరోజు వాటిని చూపిస్తూనే ఉన్నాయి. ఇంకా తెలుసుకోవాల్సిందేముంది. ఇప్పుడు వాటిగూర్చి తెలుసుకోవటానికి రాష్ట్రస్థాయిలో ఒక కమిటి, జిల్లా స్థాయిలో మరో కమిటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈకమిటీల్లో రాష్ట్రస్థాయి,జిల్లాస్థాయి అధికారులను నియమిస్తున్నారు. వీరు పల్లెపల్లెకు తిరిగి పాఠశాలలను చూసి అక్కడ ఉన్న,లేని మౌలికవసతుల గూర్చి నివేదికలు సమర్పించాలి. ఈకమిటీలు తరచు సమావేశాలు నిర్వహించుకోవాలి. ఇందుకోసం ఆయాఅధికారులు వారి అసలు విధులకు గాలికి వదిలి గిరగిరా తిరగాలి,దీనికోసం టిఏ,డిఏలపేరుతో అడ్డగోలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు తెలుసుకోవడం మొదలు పెట్టిన వారు అది పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుంది,ఆనివేదికలను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికెంత సమయం పట్టాలి, అంటే ఈఏడాది ఎలాంటి వసతులు లేని వారి చదువులు చట్టబండలయినట్లే కదా. అంతా తెలుసుకున్నాకా అవి పూర్తిచేయడానికి బోలెడు ఖర్చవుతుంది, ఖజానాలో అంతలేదంటూ వాటిని అలాగే వదిలేయరన్న గ్యారంటి లేదు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో మనప్రభుత్వం అలాగే వ్యవహరించింది. సరేలే చేస్తారో చేయరో తెలియకున్నా ఇన్నాళ్లకు చదువుల పట్ల మన పాలకులు ఓ చక్కని స్పందన కనపరిచారు, వసతులు లేవన్న విషయాన్ని గ్రహించారు, అందుకైనా అందరు కాస్త ఆనందపడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: