హైదరాబాద్: ఇండియాటుడే నిర్వహించిన సర్వే కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఇంటికేనంటూ సర్వే తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ నేతల్ని ఆగమాగం చేస్తోంది. రాష్ర్టంలో, కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ బలహీనపడగా...కేంద్రంలో ప్రత్యర్ధి పార్టీ అయిన ఎన్డీఏ కూటమి, రాష్ర్టంలో జగన్ పార్టీ అతిపెద్ద శక్తిగా మారబోతున్నట్లు సర్వే చెప్పడం కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్డీఏ కూటమి 2009ఎన్నికలకంటే బలపడ్డట్టు ఇండియాటుడే పేర్కొన్నది. ఇప్పుడంతా ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికలకు కేవలం 18నెలల గడవు మాత్రమే వుంది. ఇటీవల దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్నిచవి చూసింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తుక్కుతుక్కుగా ఓడించారు. అయినా వారు తప్పులను తెలుసుకోలేకపోయారు. తాజాగా ఇండియాటుడే నిర్వహించిన సర్వే కూడా కాంగ్రెస్ పట్ల ప్రజలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు చెప్పింది. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో కంటే కడుదయనీయంగా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ వుంది. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువరాజు రాహూల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి, ఆయన తల్లి సోనియమ్మ తహతహలాడుతోంది. ఎప్పటికైనా తన కుమారుణ్ణి ప్రధానమంత్రి సీట్లో కూర్చుండబెట్టి తనవి తీరా చూసుకోవాలనేది సోనియమ్మ చిరాకాలవాంఛ. కానీ, ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయి. దీనితో సోనియమ్మ ఆశ తీరుతుందో లేదో మరి. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతోంది.  రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. నాయకత్వలేమితో రాష్ర్ట కాంగ్రెస్ కమిటీ కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు సీమాంధ్రలో జగన్ హవా, మరోవైపు తెలం‘గానం’. గ్రూపులు, కులాలు, మతాల వారీగా, ప్రాంతాల వారీగా కాంగ్రెస్ విడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు రావడం కష్టమే. ఇప్పటికే జరిగిన ఉప ఎన్నికలు రుజువు చేశాయి కూడా. ఇండియాటుడే సర్వే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల భయం కాంగ్రెస్కు పట్టుకుంది. రాష్ర్టంలో నెలకొన్న అనిశ్చితి పార్టీ శ్రేణులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను అయోమయానికి గురి చేస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే 2014ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఎవరూ అడగరంటూ రాష్ర్ట పార్టీ వ్యవహారాల పరిశీలకుడైన వాయిలార్ రవి వద్ద మొరపెట్టుకున్నారంటే పరిస్థితులు ఏ మేరకు ‘చే’జారిపోయాయో వేరే చెప్పనక్కర్లేదు.మొత్తానికి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ క్షీణదశకు చేరుకుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: