హైదరాబాద్: ‘ఏదైనా తనదాకా వస్తే కాని తెలయదంటారు’ సరిగ్గా రాష్ర్టంలోని మంత్రుల తీరు ఇలాగే వుంది. ఓ మంత్రి తమల్ని ప్రాసిక్యూషన్ చేసే అధికారం ఏ సంస్థకు లేదంటున్నారు. తాము తప్పే చేయలేదనీ మరో మంత్రి అంటున్నాడు. ఇంకో మంత్రి కేబినెట్ నిర్ణయాలకు మంత్రుల్ని ఎలా బాధ్యుల్ని చేస్తారంటున్నారు. అందరూ కలిసి రాజీనామాలనే సహించబోమంటున్నారు. ధర్మానపై చార్జిషీటు నేపథ్యంలో ఇలా మంత్రులంతా కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. తామంతా పవిత్రులమనీ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్మాన రాజీనామా వ్యవహారం ఢిల్లీకి చేరిన దరిమిలా రాష్ర్టానికి చెందిన 22మంది మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ తో భేటీ అయ్యారు.  ధర్మాన రాజీనామా, మంత్రులపై సీబీఐ చేస్తున్న అభియోగాలపై వారంతా సీఎంతో చర్చించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు కొందరు మంత్రులను బాధ్యులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలే తప్ప ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోలేదనీ, ఈ విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకోవల్సిందిగా మంత్రులంతా సీఎంను కోరారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన కొన్ని జీవోలు కొంతమంది వ్యాపారవేత్తలకు లబ్ది చేకూరే విధంగా ఉన్నాయంటూ సీబీఐ రాష్రంలోని ఆరుగురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, వ్యాపారవేత్తలపై సీబీఐ చార్జిషీట్లను దాఖలు చేసింది. వీరిలో ఓ మంత్రిని, జగన్ను, నిమ్మగడ్డ ప్రసాదును, పలువురు ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిన విషయం విధితమే. తాజాగా ధర్మాన, మరో ఇద్దరు ఐఏఎస్ ల పేరును చార్జిషీటులో చేర్చింది. దీనితో ధర్మాన మంత్రి పదవీకి రాజీనామా చేయగా, అది సీఎం వద్ద పెండింగ్ లో వుంది. ఇదే వరుసలో మరో నలుగురు మంత్రులున్నట్లు వార్తలొస్తున్నాయి. ధర్మాన అరెస్టు కూడా తప్పదనీ వార్తలు బలంగా వినిపిస్తున్న క్రమంలో పీసీసీ చీఫ్ బొత్స ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు వెళ్లడం...కేబినెట్ లోని 22మంది మంత్రులు సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ధర్మానతో పాటు మిగతా మంత్రుల రాజీనామాల విషయాన్ని సహించబోమనీ కూడా మంత్రుల తరుపున మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అంటున్నారు. సీబీఐ అభియోగాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు తక్షణమే సీఎం, పీసీసీ చీఫ్ కలగజేసుకుని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చొరవ తీసుకోవాలనీ మంత్రులంతా సీఎంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు కొందర్ని బలి చేయడం మంచిది కాదనేది మంత్రుల భావనగా తెలుస్తోంది. మంత్రుల తీరు చూస్తుంటే సీబీఐ ఈ గండం నుంచి తాము గట్టెక్కితే చాలు అన్నట్లుగా కనిపిస్తోంది. చేసిన తప్పులన్నీ చేసేసీ ఇప్పుడు తమల్ని తాము రక్షించుకోవడానికి ఆనాడు జగన్ దోపిడీపై ఆయన తల్లి విజయమ్మ అడ్డుకట్ట వేసి ఉంటే ఈరోజున బీసీ మంత్రులెవరూ బలయ్యేవారు కాదనీ ఆనం వంటి అమాత్యులంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో తప్పు మంత్రులదా? ఐఏఎస్ లదా? వ్యాపారవేత్తలదా? జగన్ దా? విజయమ్మదా?అనేది తేలాల్సి వుంది.ఎవరికి వారు తామంటే తాము తప్పు చేయలదంటున్నారు. అందరూ బ్రహ్మణులే అయినప్పుడు రొయ్యల మూట ఎల మాయమైందో అమాత్యులే సెలవిస్తే బాగుంటుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: