హైదరాబాద్: ‘దొంగలు పడ్డాక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన’చందంగా వుంది మన రోడ్డు రవాణా శాఖాధికారుల పని తీరు.  ఎంతోమంది ప్రాణాలు పోయాక కానీ అధికారులు స్పందించలేదు.రాష్ర్టంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో కాని సదరు ఆర్టీఏ అధికారులు మేల్కొనలేదు. షిర్డీ రోడ్డు ప్రమాదంలో 32మంది వరకు దుర్మరణం చెందారు. దానికి తోడుగా వరుసగా రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనితో మేల్కొన్న ఆర్టీఏ అధికారులు గత మూడు రోజులుగా రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దాడులు నిర్వహించారు. ట్రావెల్స్ సంస్థలతో పాటు ప్రయివేట్ స్కూళ్లపై కూడా తనిఖీలు చేయగా, నిబంధనలకు విరుద్దంగా అనేక బస్లు రోడ్లపై తిరుగుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వందకుపైగా బస్లను సీజ్ చేశారు. పలు సంస్థలపై కేసులు నమోదు చేశారు. తాజాగా బుధవారం నాడు మెదక్, కరీంనగర్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, క్రిష్ణ, ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాలో అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలను అతిక్రమించిన వాటిపై చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఆర్టీఏ అధికారులు ఆలస్యంగానైనా రంగంలోకి దిగడం హర్షించదగ్గ విషయమే. భవిష్యత్లో కూడా ఆర్టీఏ అధికారులు ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే ప్రయివేట్ బస్ సర్వీస్ ఆపరేటర్లను నిబంధనలకు లోబడి బస్ సర్వీసులను నడిపించే అవకాశం వుంది. తద్వార రోడ్డు ప్రమాదాలను నివారించడంతో ఎంతో విలువైన ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: