రానున్న కాలంలో మరికొంత మంది ముఖ్యమైన నాయకులు వారివారి పార్టీలను విడిచి వైఎస్ఆర్ సిపి గూటికి చేరుకోనున్నారు. జైళ్లో నుండి రాజకీయాలు నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం కోసం వారు ఆసక్తి చూపుతున్నారు. అధికారపార్టీతో పాటు తెలుగుదేశంపార్టీ నుండి వైఎస్ఆర్ సిపిలో చేరడం కోసం సిద్దమవుతున్నారు. వైఎస్ఆర్ సిపి గూటికి చేరుకునే వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బయటకు వస్తున్నాడని ఆయన సమక్షంలోనే పార్టీలోనే చేరుదామనుకున్నారు. కాగా జగన్ కు ఇప్పట్లో బేయిల్ వచ్చే అవకాశం లేదని తెలియడంతో అంతకాలం వేచిచూడడం ఎందుకని ఇప్పుడే పార్టీలో చేరితే ప్రాధాన్యత ఉంటుందని భావించినటువంటి నాయకులు జగన్ తో మంతనాటు జరిపి వారి చేరికను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావ్, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు లు నవంబర్ లో చేరేందుకు ముహుర్తంగా నిర్ణయించుకున్నారు. నవంబర్ 11న సంకినేని వెంకటేశ్వర్ రావు వైఎస్ఆర్ సిపిలో చేరనుండగా, ఇదే నెల 19న జలగం వెంకట్రావ్ చేరనున్నారు. వీరు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల ముందు వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో చేరనున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ సిపిలో చేరబోయే నాయకులు అందరి మాదిరిగానే ఇదివరకు వారు పనిచేసిన పార్టీ విధానాలు, నాయకుల వైఖరిని నచ్చకనే చేరుతున్నామని ప్రకటించారు. కాగా మరికొంత మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపిలో చేరేందుకు సిద్దపడుతున్నారు. ఈనెల 18నుండి మరోప్రజాప్రప్థానం పేరిట దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పాదయాత్ర చేపట్టనున్నారు. షర్మిల పాద యాత్ర జగన్ చేపట్టిన ఓదార్పుయాత్ర మాదిరిగానే విజయవంతం అవుతుందని మెజార్టీ ప్రజలు బావిస్తున్నారు. కాగా జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యమైనటువంటి నాయకులు జగన్ కు అండగా నిలిచారు. జగన్ పార్టీలో చేరారు. కాగా షర్మిల పాద యాత్ర సందర్బంగా ప్రజల నుండి వచ్చే స్పందన చూసి మరింత మంది ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలు, ఆయా పార్టీ లకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు వైఎస్ఆర్ సిపిలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా చిత్తూరు జిల్లాకుచెందిన టిడిపి ఎమ్మెల్యేలు అమర్ నాథ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిలు తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయంలో నిప్పులుగక్కారు. ఇదే అదునుగా చూపి వీరు వైఎస్ఆర్ సిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. దీంతో పాటు కర్నూల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వారితో పాటు ముఖ్యమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ సిపి లో చేరేందుకు సిద్దపడుతున్నట్టు తెలుస్తుంది. వీరంత షర్మిల పాద యాత్ర సందర్భంగా చేరే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: